దర్శకుడు నితేష్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రామాయణ్. ఇందులో రావణుడిగా కనిపిస్తానని కథానాయకుడు హృతిక్ రోషన్ గతంలో ప్రకటించారు. అయితే.. అనివార్య కారణాలతో అందులోంచి తప్పుకున్నారు. దీంతో తన కలల ప్రాజక్టుగా భావిస్తున్న 'క్రిష్ 4'ను శరవేగంగా ప్రారంభించే యోచనలో ఉన్నారు. దీని స్క్రిప్ట్ పని పూర్తి చేసేందుకు తండ్రి రాకేష్ రోషన్‌తో చర్చలు జరుపుతున్నారు. హృతిక్ ప్రస్తుతం ఈ సూపర్ హీరో చిత్ర దర్శకుడి వేటలో పడ్డట్టు సమాచారం. దీనికోసం తన టీం ఐదారుగురు హాలీవుడ్ దర్శకుల జాబితా సైతం సిద్ధం చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకరి పేరు ఖరారు కాగానే చిత్రీకరణ మొదలు కానున్నట్టు తెలుస్తోంది.
రాకుమారుడితో కలిసి.. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ నాయకానాయికలుగా రోహిత్ ధావన్ తెరకెక్కించిన చిత్రం షెహ్‌జాదా. రోనిత్‌రాయ్, మనీషా కోయిరాలా, పరేష్ రావల్ కీలక పాత్రలు పోషించారు. ఇది తెలుగు అలవైకుంఠపురములో..కి రీమేక్. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారపర్వాన్ని వేగవంతం చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఆదివారం సినిమాలోని కొత్త పోస్టర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు కార్తీక్ ఆర్యన్, కృతిసనన్‌లు. "షెహ్‌జాదా’ చిత్రం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇంక కొత్త కబుర్లేం లేవు. నేరుగా వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవడమే" అని కార్తీక్ ఆర్యన్ చెప్పగా.. రాకుమారుడితో కలిసి మీ ముందుకొస్తున్నా' అనే క్యాప్షన్ జోడించింది కృతి.
మరో వారసుడు ఎంట్రీ.. బాలీవుడ్‌లో మరో వారసుడు తెరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్-అమృతా సింగ్‌ల తనయుడు ఇబ్రహీం అలీఖాన్ సినిమాల్లోకి వస్తున్నాడని గతంలో చాలా వార్తలు వెలువడ్డాయి. ఆదివారం ఆ వివరాల్ని అధికారికంగా ప్రకటించారు. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి ‘సర్జమీన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరి 24 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు.
ఇదీ చూడండి: సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడిదే ట్రెండ్.. కథలన్నీ మొదటికొస్తున్నాయిగా.