- Phalana Abbayi Phalana Ammayi Movie Review:
- సినిమా పేరు: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
- నటీనటులు - నాగ శౌర్య, మాళవికా నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు
- నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్
- నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
- దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల
- సంగీతం: కల్యాణి మాలిక్, వివేక్ సాగర్ (కాఫీఫై సాంగ్)
- సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ
- ఎడిటర్ : కిరణ్ గంటి
- విడుదల తేది: మార్చి 17, 2023
'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవరాల కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం (మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
హీరో సంజయ్ (నాగశౌర్య), హీరోయిన్ అనుపమ (మాళవిక నాయర్) ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నవాళ్లు. సంజయ్ కంటే అనుపమ కాలేజీలో సీనియర్. దీంతో ర్యాగింగ్ వల్ల ఓ సంఘటనలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత చదువుకునేందుకు ఇద్దరూ లండన్ వెళతారు. అక్కడ సంజయ్, అనుపమ మధ్య ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత సహజీవనం చేస్తారు. అనుకోని కొన్ని సంఘటనలు వారిని వేరు చేస్తాయి. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పూజ ప్రేమను సంజయ్ అంగీకరించాడా? అనుపమ జీవితంలోకి గిరి(అవసరాల శ్రీనివాస్) ఎలా వచ్చాడు? చివరికి సంజయ్, అనుపమలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ.
![hero nagashaurya new movie phalana abbayi phalana ammayi review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18013263_papa-1.jpeg)
ఎలా ఉందంటే:
కాలేజీలో పరిచయమైన ఓ జంట పదేళ్ల ప్రయాణమే ఈ కథ. స్నేహంతో మొదలైన ఈ జంట జీవితాన్ని పంచుకునే క్రమంలో ఎలాంటి సంఘర్షణకు గురైందనేది కీలకం. ఇలాంటి సంఘర్షణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. కాస్త అటూ ఇటూగా ఇలాంటి నేపథ్యాన్ని.. ఈ తరహా భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తూ పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందుకే ఈ సినిమా కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. సున్నితమైన కథాంశాలకు పెట్టింది పేరైన శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాను కొత్త పంథాలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కథనంలో వేగం మందగించింది. ఎక్కడున్న కథ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రథమార్ధంతో కాలేజీ, స్నేహం, సహజీవనం చుట్టూ సన్నివేశాల్ని మలిచారు దర్శకుడు. ద్వితీయార్ధంలోనే భావోద్వేగాలు పర్వాలేదనిపిస్తాయి. కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్న జంట విడిపోవడం వెనక ఉండే కారణాన్ని బలంగా ఆవిష్కరించడం కీలకం. కానీ, ఈ సినిమాలో ఆ విషయాన్ని ప్రభావవంతంగా ఆవిష్కరించలేకపోయారు దర్శకుడు.
![hero nagashaurya new movie phalana abbayi phalana ammayi review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18013263_papa-2.jpg)
ఎవరెలా చేశారంటే?
సినిమాలో సంజయ్‌గా హీరో నాగశౌర్య మెప్పించాడు. లుక్స్ పరంగా చాలా మార్పులు ఉన్న పాత్ర తనది. ఇలాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాలు.. పాత్రలు నాగశౌర్యకు కొత్తేమి కాదు. గత సినిమాల్లో మాదిరే లవర్ బాయ్‌గా సంజయ్ చక్కగా నటించాడు. ఇక అనుపమగా మాళవికా నాయర్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం వీరిద్దరి పాత్రల చుట్టే తిరుగుతుంది. గిరిగా అవసరాల శ్రీనివాస్ మెప్పించాడు. అభిషేక్ మహర్షి తనదైన కామెడీతో నవ్వించాడు. సాంకేతిక విషయాలకొస్తే.. కల్యాణి మాలిక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.
![hero nagashaurya new movie phalana abbayi phalana ammayi review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18013263_papa-1.jpg)
- బలాలు: నాగశౌర్య, మాళవిక జోడీ, ద్వితీయార్ధంలో భావోద్వేగాలు
- బలహీనతలు: సాగదీతగా సన్నివేశాలు, కథ, కథనాల్లో లోపించిన కొత్తదనం
- చివరిగా: అబ్బాయి అమ్మాయి మాత్రమే మెప్పిస్తారు!
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- ఇవీ చదవండి:
- 'ఏంటి కీర్తి.. నువ్వేనా?'.. 'దసరా' బ్యూటీ అందాలు చూసి నెటిజన్లు షాక్!
- రెమ్యునరేషన్లో వంటలక్కదే పై చేయి.. రోజుకు ఎంతంటే?