Film Companion Round Table : ఆయా సంవత్సరాల్లో ప్రేక్షకుల మన్ననలు పొందిన సినిమాల దర్శకనిర్మాతలు, నటులతో 'ఫిల్మ్ కాంపానియన్' సంస్థ 'రౌండ్ టేబుల్' అనే చిట్ చాట్ నిర్వహిస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన వారిని ఆహ్వానిస్తుంటుంది. అలా ఈ ఏడాది చెన్నై వేదికగా నిర్వహించిన 'ఫిల్మ్ మేకర్స్ అడ్డా' విభాగంలో అగ్ర దర్శకుడు రాజమౌళి, గౌతమ్ వాసుదేవ్ మేనన్, లోకేశ్ కనగరాజ్, పృథ్వీరాజ్ సుకుమారన్, కమల్ హాసన్, స్వప్నదత్ చలసాని హాజరయ్యారు.
'యాక్టర్స్ అడ్డా'లో విద్యా బాలన్, అనిల్ కపూర్, దుల్కర్ సల్మాన్, రిషబ్ శెట్టి, ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్, షీబా చద్దా, వరుణ్‌ధావన్, విజయ్ వర్మ జాన్వీ కపూర్‌లు మెరిశారు. వీరిలో కొందరు సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వివిధ పరిశ్రమకు చెందిన వారిని ఒకే చోట చేరడంపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
"నేనెంతగానో అభిమానించే నటులను కలిసే అవకాశం దక్కింది. దీన్ని గౌరవంగా భావిస్తున్నా" అని జాన్వీ కపూర్ తెలిపారు. "అద్భుతమైన నటులతో అద్భుతమైన చర్చ" అని రిషబ్ క్యాప్షన్ ఇచ్చారు. "ఇంతమంది డార్లింగ్స్‌తో ముచ్చటించేందుకు 'డార్లింగ్స్' సినిమా నాకు అవకాశం కల్పించింది" అని విజయ్ వర్మ పేర్కొన్నారు. "ఈ రౌండ్ టేబుల్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది" అని షీబా చద్దా చెప్పారు.
'ఆర్‌ఆర్‌ఆర్'తో రాజమౌళి, 'విక్రమ్'తో లోకేశ్ కనగరాజ్, 'వెందు థనిందదు కాదు'తో గౌతమ్ మేనన్ దర్శకులుగా మంచి విజయం అందుకున్నారు. 'విక్రమ్' చిత్రంలో కమల్ హాసన్ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ కేటగిరీలో ఆయన వెళ్లినట్టు తెలుస్తోంది. 'సీతారామం' తరఫున నిర్మాత స్వప్న వెళ్లారు.
డైరెక్టర్‌గా 'బ్రో డాడీ', ప్రొడ్యూసర్‌గా పలు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు పృథ్వీరాజ్ సుకుమారన్. 'కాంతార'తో రిషబ్, 'సీతారామం'తో దుల్కర్ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారు తమ సినిమా ఆలోచన ఎలా వచ్చింది? వాటిని తెరకెక్కించే క్రమంలో ఎదురైన సమస్యలేంటి? తదితర అంశాలను చర్చిస్తుంటారు.