Gudipudi srihari died: ప్రముఖ సినీ విశ్లేషకులు, సాహితీవేత్త గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. 88 ఏళ్ల వయస్సున్న ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. 55 ఏళ్ల పాటు సినీ రంగంలో పాత్రికేయుడిగా, విశ్లేకుడిగా సేవలందించిన గుడిపూడి శ్రీహరి... సినిమా సమీక్షలకు శ్రీకారం చుట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఈనాడు దినపత్రికలో హరివిల్లు పేరుతో వర్తమాన, రాజకీయ వ్యవహారాలపై దాదాపు 25 ఏళ్లపాటు వ్యంగ్య రచనలు చేశారు.
తెలుగు చిత్రసీమ ప్రస్థానంలో అనేక ముఖ్య ఘట్టాలను శ్రీహరి అక్షరబద్దం చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని గుడిపూడి రచించారు. జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థలో సభ్యుడిగానూ, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ గుడిపూడి శ్రీహరి పనిచేశారు. 2013లో తెలుగు విశ్వవిద్యాలయం గుడిపూడిని కీర్తి పురస్కారంతో సత్కరించింది. గుడిపూడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం గుడిపూడి శ్రీహరి మృతదేహం నిమ్స్ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపర్చారు. న్యూజిలాండ్ లో ఉన్న కుమారుడు వచ్చాక ఈ శని లేదా ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
చిరు సంతాపం.. ప్రముఖ సినీ విమర్శకులు గుడిపూడి శ్రీహరి మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శ్రీహరి నిఖార్సయిన నిబద్దత కలిగిన సినీ విమర్శకుడని కొనియాడారు. తన ఎన్నో చిత్రాలపై గుడిపూడి రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు నటుడిగా ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకునేందుకు దోహదపడాయని చిరంజీవి పేర్కొన్నారు. స్పష్టమైన సంభాషణలు పలికేందుకు ఒక రకంగా శ్రీహరి రాసిన విమర్శలే కారణమని చిరంజీవి తెలిపారు. అలాంటి గుడిపూడి శ్రీహరి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్న చిరంజీవి.. శ్రీహరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పవన్ సానుభూతి.. శ్రీహరి మృతిపై పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కూడా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శ్రీహరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. "పాత్రికేయరంగంలో.. ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో గుడిపూడి శ్రీహరిది విశేష అనుభవం. ఆయన సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి. తెలుగు చిత్రసీమ ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను శ్రీహరి అక్షరబద్ధం చేశారు. ‘హరివిల్లు’ శీర్షికతో చేసిన రచనలు ఆయన నిశిత పరిశీలనను తెలిపేవి" అని పవన్ అన్నారు.
ఇదీ చూడండి: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఇంట విషాదం