ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాను హిందీలో 'షెహజాదా' అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ మూవీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితం హిందీలో 'అల వైకుంఠపురంలో' సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుచేసిన మనీశ్.. 'షెహజాదా' నిర్మాతల మధ్య వివాదం తలెత్తింది. ఇప్పుడీ వివాదం మరింత ముదిరింది. దీంతో 'షెహజాదా' రిలీజ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇదీ కథ.. గతంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' బాలీవుడ్లో సంచలనం విజయం సాధించింది. దీంతో బన్నీ నటించిన 'అల వైకుంఠపురంలో' డబ్బింగ్ హక్కులను నిర్మాత మనీశ్ షా కొనుగోలు చేసి హిందీలోకి డబ్ చేశారు. అంతే కాకుండా, గతేడాదే థియేటర్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో, అప్పటికే ఆ చిత్రాన్ని 'షెహజాదా' పేరుతో రీమేక్ చేస్తున్న చిత్ర బృందం ఒక్కసారిగా షాక్ అయింది. సినిమా రీమేక్ చేస్తుంటే, తెలుగు వెర్షన్‌ను డబ్బింగ్ చేసి ఎలా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తారంటూ మనీశ్‌తో వాగ్వివాదానికి దిగింది. అప్పుడు మనీశ్.. ఒకవేళ రీమేక్ విడుదలైతే తనకు భారీగా నష్టం కలుగుతుందని, తన డబ్బింగ్ సినిమా రిలీజ్ చేయకుండా ఉండాలంటే రీమేక్ చిత్రం ద్వారా వచ్చిన లాభాల్లో వాటా కావాలని అడిగారు. అందుకు ససేమీరా అన్న షెహజాదా నిర్మాతలు.. మనీశ్‌తో వివాదాన్ని కొనసాగించారు.
అలా ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. అయితే ఆ సమయంలోనే మనీశ్ షాతో.. రీమేక్ చిత్ర బృందం సంప్రదింపులు జరిపి, సినిమా యూట్యూబ్ విడుదలను పోస్ట్‌పోన్ చేసింది. కానీ తాజాగా మనీశ్ మరోసారి.. రీమేక్ ప్రొడ్యూసర్స్‌కు సవాల్ విసిరాడు. ఒరిజినల్ డబ్బింగ్ సినిమాను తన 'గోల్డ్ మైన్స్' ఛానల్లో ఫిబ్రవరి 2న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అది ఇంకా యూట్యూబ్‌లోకి రాలేదు. ఒకవేళ ఇదే కనుక జరిగితే.. ఇప్పటికే 'పుష్ప'తో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ ఒరిజినల్ సినిమా (అల వైకుంఠపురంలో) చూసేందుకు ఆడియెన్స్ మొగ్గు చూపుతారు. దీంతో రీమేక్ చిత్రానికి నష్టం కలిగే అవకాశం ముంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.