Model Suicide: బంగాల్లోని కోల్‌కతాలో మోడల్స్ వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వారంలోనే ముగ్గురు మోడల్స్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం నటి బిదిషా డీ మజుందార్ తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే ఇప్పుడు మరో మోడల్, యువ నటి కూడా సూసైడ్ చేసుకున్నారు. కోల్‌కతాలోని పటులి ప్రాంతంలోని తన నివాసంలో శుక్రవారం నటి మంజుష విగతజీవిగా కనిపించారు.
సూసైడ్ చేసుకున్న మోడల్‌ను మంజుషా నియోగిగా గుర్తించారు పోలీసులు. ఆమె బుధవారం ఆత్మహత్య చేసుకున్న బిదిషా డీ మంజుదార్ స్నేహితురాలని తెలిపారు. బిదిషా చనిపోయినప్పటి నుంచి మంజుష డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. "నా కూతురు, బిదిషా ప్రాణ స్నేహితులు. ఆమె మరణంతో నా కూతురు డిప్రెషన్లోకి వెళ్లింది. అప్పటినుంచి ఆమె తన స్నేహితురాలి గురించి ప్రతిక్షణం మాట్లాడేది. త్వరలో మీడియా మన ఇంటికి కూడా వస్తారని నా కూతురు అన్నప్పుడు నేను ఆమెను తిట్టాను." అని మంజుష తల్లి తెలిపింది.
ప్రస్తుతం పోలీసులు.. మంజుష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల కారణాలను తెలుసుకోవచ్చని పోలీసులు వెల్లడించారు. మంజుష స్నేహితురాలు.. బిదిషా మజుందార్ కూడా కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. కెరీర్లో అవకాశాలు లేకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ లెటర్‌ను రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలకు కొన్ని రోజుల ముందు మరో మోడల్, పల్లవి కూడా కోల్‌కతాలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించారు.
ఇవీ చదవండి: పాన్ ఇండియా సినిమాలపై కమల్ ఆసక్తికర కామెంట్స్