ఈ ఏడాది హిందీ చిత్రపరిశ్రమలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. తాజాగా ఈ విషయంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ మాట్లాడారు. ఇటీవల రాజమౌళితో పాటు పలువురు చిత్ర నిర్మాతలతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.
కొవిడ్ సమయంలో చిత్ర పరిశ్రమ ఎంతో నష్టపోయిందని.. బాలీవుడ్ ఇప్పటి వరకు కూడా కోలుకోలేకపోయిందని కమల్ అన్నారు. చాలా తక్కువ బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఈ సంవత్సరం ప్రేక్షకుల అంచనాలు అందుకున్నాయని చెప్పారు. మరోవైపు సౌత్ సినిమాలు బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తున్నాయని ప్రశంసించారు.
ఒక హిట్ సినిమా తీయాలంటే ఏం కావాలనే ప్రశ్నకు కమల్ సమాధానం చెబుతూ..'ఇంగ్లిషు సినిమాలు చూసే ముందు భారతీయ చిత్రాలను చూడాలి. హిందీ, బెంగాలి చిత్రాలను చూస్తే వాటిల్లో నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇది నేను బాలీవుడ్ దర్శకులకు ఇచ్చే సలహా. హిందీ ఇండస్ట్రీకి ఏమీ తెలియదని మీరు అనుకోవచ్చు కానీ నేను చాలా మంది బాలీవుడ్ వాళ్లని చూసి స్ఫూర్తి పొందాను'.
'నేను అభిమానించే వాళ్లలో కొందరు హిందీ వాళ్లు కూడా ఉన్నారు. ఉత్తరం, దక్షిణం అంటుంటారు కాదా.. అలా ప్రస్తుతం సూర్యుడు ఇక్కడ(సౌత్ ఇండస్ట్రీలో) ప్రకాశిస్తున్నాడు. అందుకే సౌత్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను' అని కమల్ హాసన్ అన్నారు.