మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన ఇచ్చింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని.. హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్ లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.
వివేకా హత్య కేసులో 76వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణ చేపట్టిన అధికారులు ఈరోజు వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ్‌తుల్లాను ప్రశ్నిస్తున్నారు. సీబీఐ విచారణకు అనంతపురం జిల్లాకు చెందిన విజయ్‌శంకర్‌రెడ్డి హాజరయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి 76 రోజులుగా సీబీఐ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి అనేక మందిని ఇప్పటికే ప్రశ్నించారు సీబీఐ అధికారులు. వివేకా హత్య జరిగిన తర్వాత వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 20 మంది ఘటనాస్థలంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో ఉన్న వారిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో, కడప జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. పలువురిని ప్రశ్నించారు.