మద్యం మత్తులో ఘర్షణ.. ఓ వ్యక్తి దారుణ హత్య
విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న గవర్నర్ బంగ్లా వెనక పందిమెట్ట ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పితానిదిబ్బకు చెందిన కాగితం ప్రసాద్ అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కలిసి తలపై రాళ్లతో బలంగా కొట్టి చంపారు. పట్టపగలే ఈ ఘటన జరగడంతో అటుగా వెళ్తున్న వారు చూసి నిందితులను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడవ పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం
కృష్ణాజిల్లా పామర్రు గ్రామంలోని నాలుగు రోడ్ల కూడలి కాలువ గట్టుపై విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు కుటుంబాలకు చెందిన నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సమీప ప్రాంతాలకు మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించారు. ప్రమాదంలో సుమారు ఐదు లక్షల మేర నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో కట్టుబట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటు బాధిత కుటుంబాలు విన్నవించుకుంటున్నాయి.
ఏపీ ఫైబర్ నెట్వర్క్లో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్కు విద్యుత్ షాక్
తెనాలి పరిధిలోని అత్తోట గ్రామంలో ఏపీ ఫైబర్ నెట్వర్క్లో విధులు నిర్వహిస్తున్న తెనాలికి చెందిన రత్నరాజు అనే లైన్మెన్ విద్యుత్ షాక్కు గురయ్యాడు. సోమవారం ఫైబర్ నెట్ పనుల కోసం విద్యుత్ స్తంభం పైకి ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో స్తంభం పై నుంచి కింద పడిపోయాడు. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. విషయాన్ని గమనించిన ఫైబర్ నెట్ గుత్తేదారులు హుటాహుటిన రత్నరాజు తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రత్నరాజు వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే చెల్లిస్తామని గుత్తేదారులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం గుత్తేదారులు అక్కడి నుంచి మాయమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు మోసపోయామని తెలుసుకుని రత్నరాజుని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రత్నరాజు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. తమ కుమారుడికి న్యాయం చేయాలని రత్నరాజు తల్లి డిమాండ్ చేశారు.
తెదేపా కార్యకర్త హుస్సేన్ పూరిల్లుని తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెం గ్రామం లో హుస్సేన్ అలియాస్ నన్నేసా పూరిల్లుని గుర్తుతెలియని వ్యక్తులు తగలపెట్టారు. హుస్సేన్ తెదేపా కార్యకర్త అని, తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలియజేశారు. ఇంటిలోని వంటసామాన్లు, బట్టలు పూర్తిగా దగ్ధమైనవని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో రైల్వే ట్రాక్ సూపర్వైజర్ మృతి
గుంటూరు జిల్లాలో కురిచేడు రైల్వే స్టేషన్ నుంచి గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ వరకు ట్రాక్ మెయింటినెన్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్న నల్ల ప్రశాంత్ రెడ్డి (21) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా యాదాద్రి మూట కొండూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి గుండ్లకమ్మ స్టేషన్లో ట్రాక్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం కురిచేడు నుంచి గుండ్లకమ్మ స్టేషన్ వద్దకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యమున చింతలచెరువు వద్ద కుక్క అడ్డొచ్చి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలై మృతి చెందాడు. ఈ మేరకు అయినవోలు ఎస్సై అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Loco Pilots: అవకాశాలను అందిపుచ్చుకుని.. లోకో పైలెట్లుగా దూసుకెళ్తూ