రైలు కింద పడి ఇద్దరు మృతి: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరికి 25 సంవత్సరాలు, మరొకరికి 60 ఏళ్ల వయస్సు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇటుకల బట్టీలో భారీ అగ్నిప్రమాదం: అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఎర్రవరం సమీపంలోని ఇటుకల తయారీ బట్టి వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇటుకల తయారీకి ఉపయోగించే సామగ్రితో పాటు వరికుప్పలు, ధాన్యపు నిల్వలు పూర్తీగా బూడిద అయ్యాయి. సమాచారం అందుకున్న నర్సీపట్నం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేసినా.. అప్పటీకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య: బాపట్ల జిల్లా జే.పంగులూరు మండలం చందలూరు గ్రామంలో కౌలు రైతు సర్దన వీరాంజనేయులు (49) పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
తృటిలో తప్పిన బస్సు ప్రమాదం: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ప్రమాదం జరిగింది. ముట్లూరులో కాల్వలోకి ప్రైవేటు పాఠశాల బస్సు దూసుకెళ్లింది. చివరి నిమిషంలో డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు.
భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి గాయాలు: తిరుమల రాంభగీచ వద్ద భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని అశ్విని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: బజారుకెక్కిన "కేబినెట్ పంచాయితీ".. ఆశావహుల్లో నిరసన జ్వాల!