Chain Snatching and Fake currency gang arrested: తెలంగాణ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధి హస్తీనాపురంలో జనవరి 1న ముగ్గురు దుండగులు.. ఓ మహిళ మెడలో నుంచి 2 గొలుసులు లాక్కెళ్లారు. గది అద్దెకు తీసుకుంటామనే సాకుతో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు.. ఇంటి యజమానురాలిని మాటల్లోకి దించారు. తాగేందుకు నీళ్లు కావాలని అడిగి... ఆమె లోపలికి వెళ్లగానే నోరు అదిమిపట్టి రెండు బంగారు గొలుసులను లాక్కెళ్లారు. అప్పటికే బయట ద్విచక్రవాహనంపై వేచి ఉన్న మూడో వ్యక్తితో కలిసి ముగ్గురు పరారయ్యారు. ఈ ముగ్గురు నిందితులు వేర్వేరు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు అక్కడే వీరికి పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు జూబ్లీహిల్స్‌లో ఉంటున్న నెల్లూరుకు చెందిన వెంకటశేషయ్య, తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌కు చెందిన అహ్మద్, కుత్బుల్లాపూర్‌లోని చింతల్‌కు చెందిన హరిబాబు అని తెలిపారు. వృద్ధుల ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
జైల్లో ఆ ముగ్గురికి పరిచయం అయింది. గోల్డ్ రేట్లు పెరిగిన నేపథ్యంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. జైలు నుంచి బయటికివచ్చి ప్రాపర్‌గా రెక్కీ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఆ రోజు హస్తినాపురంలోనూ ఇలాగే చేశారు. దొంగనోట్లను కూడా ముద్రిస్తున్నారు. శ్రద్ధగా పరిశీలిస్తే.. దొంగనోట్లకు, అసలు నోట్లకు తేడా తెలుస్తుంది.
-మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
ఆరా తీస్తే అసలు దందా బయటకు..
గొలుసు చోరీకి సంబంధించి దర్యాప్తులో భాగంగా నిందితుల ఇళ్లల్లో పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో వెంకటశేషయ్య ఇంట్లో రూ.40వేల రూపాయల నకిలీ నోట్లు బయటపడ్డాయి. వీటి గురించి ఆరా తీయగా నకిలీ నోట్ల దందా బయటపడింది. నకిలీ నోట్ల వెనక తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వెంకటకృష్ణారెడ్డి ప్రధాన సూత్రధారిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు తన గ్రామానికే చెందిన వ్యక్తులతో కలిసి నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు తేల్చారు. నాలుగు నెలలుగా నకిలీ 500, 200,100 నోట్లను ముద్రిస్తూ... కొంతమంది ఏజెంట్లను నియమించుకుని... వాటిని చలామణి చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు వెంకటకృష్ణారెడ్డితోపాటు... అతని నకిలీ నోట్లు ముద్రించడం నేర్పించిన శ్రీనివాస్‌రెడ్డి, మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్.... నకిలీ నోట్లను గుర్తించే జాగ్రత్తలను తెలిపారు.
ఇదీ చదవండి: Crime News: ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి