Secunderabad Girl Kidnapping Case: తెలంగాణలోని సికింద్రాబాద్ మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో చిన్నారి అపహరణ కేసు సుఖాంతమైంది. ఆరేళ్ల చిన్నారి కృతికను పోలీసులు.. తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం పరిధిలోని నరసింహారావు-రేణుక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె ఆరేళ్ల కృతిక. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి కనిపించకుండాపోయింది.
చుట్టుపక్కల గాలించిన తల్లిదండ్రులు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వ్యక్తితో కలిసి పాప వెళ్తున్నట్లు కనిపించింది. వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి చిన్నారి జాడ కోసం వెతికారు. సిద్దిపేట వైపు వెళ్లినట్లు గుర్తించి బాలికను రక్షించారు. సిద్దిపేట జిల్లా ధోల్‌మెట్ట వద్ద బాలిక ఉన్నట్లు తెలుసుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బాలికను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్కడికి వెళ్లిన మహంకాళి స్టేషన్ పోలీసులు సురక్షితంగా హైదరాబాద్ తీసుకొచ్చారు. తల్లిదండ్రులకు ఏసీపీ రమేశ్ పాపను అప్పగించారు. నిందితుడిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక చెవులకు ఉన్న కమ్మల కోసమే అపహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. కుమార్తెను క్షేమంగా అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు సురక్షితంగా అప్పగించిన తమ గారాలపట్టిని చేతుల్లోకి తీసుకున్న కుటుంబ సభ్యులు ఆనందభాష్పాలు రాల్చారు.
"కృతిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఈ క్రమంలోనే సిద్దిపేటలో చిన్నారి ఉందని గుర్తించాము. అక్కడికి నుంచి బాలికను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించాం. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం." - రమేశ్, ఏసీపీ
ఇవీ చదవండి: