అధిక వడ్డీ పేరుతో దాదాపు కోటి రూపాయలు కుచ్చుటోపీ పెట్టి ఓ వ్యక్తి పరారైన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్వతి నగర్లోని శ్రీ గురు ఫైనాన్లో పనిచేస్తున్న శ్రీనివాసులు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి గత కొంత కాలంగా అవసరాల కోసం డబ్బులు తీసుకోవడం ఇవ్వడం లాంటి లావాదేవీలు చేస్తూ వచ్చాడు. ఇలా దాదాపు పట్టణంలోని కొందరి వద్ద అప్పులు చేశాడు. కొన్ని రోజుల నుంచి డబ్బులు తిరిగి చెల్లించకపోగా.. తాజాగా ఇంటి నుంచి కుటుంబంతో సహా ఉడాయించాడు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
అబద్దాలు చెప్పి అప్పులు..
ఇంటి నిర్మాణం కోసమంటూ కొందరి వద్ద, కుమారుని ఉద్యోగం కోసమంటూ చెప్పి మరి కొంతమంది దగ్గర దాదాపు కోటి రూపాయల వరకు అప్పులు చేశాడు. కొందరి వద్ద ఏకంగా ఇంటి పత్రాలను కలర్ జిరాక్స్ చేసి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. మరి కొందరికి ప్రామిసరీ నోటు రాసిచ్చి అప్పు తీసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసమంటూ పట్టణంలోని సుశీలమ్మ వద్ద రూ.3.80లక్షలు, కుమారుని ఉద్యోగం కోసమంటూ శ్రీనివాసులు అనే వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు ఇలా దాదాపు 50, 60 మంది వద్ద సుమారు కోటి రూపాయలు అప్పులు చేసి పరారయ్యాడు.
ఇల్లు అమ్మి డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి ఉడాయింపు ..
కొన్ని రోజులు అప్పులు తీసుకున్న వారికి సక్రమంగా వడ్డీ చెల్లించాడు. ఇల్లు అమ్ముతున్నాను జూలై 1 న అప్పులు తీసుకున్న వారందరికీ అప్పులు తీర్చేస్తానని నమ్మబలికాడు. జూన్ 29న కుటుంబ సమేతంగా పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
ఇదీ చదవండి:
AP - TS Water Disputes: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయండి: కేంద్రమంత్రికి సీఎం లేఖ
Sharmila: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న షర్మిల పార్టీ జెండా !