Life Imprisonment: అక్క భర్తతో వివాహేతర సంబంధం నెరిపి భర్తను అడ్డు తొలగించిన భార్య, ఆమెకు సహకరించిన బావ, మరో ఇద్దరు యావజ్జీవ కారాగార శిక్షకు గురయ్యారు. "ఫిరంగిపురం మండలం పొనుపాడుకి చెందిన నల్లబోతు నరేంద్ర తన సమీప బంధువు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని శ్రీవిద్యను వివాహం చేసుకున్నాడు. అతను పేరేచర్ల పరిశ్రమలో కాపలాదారు. వీరికి సంతానం లేదు. పెళ్లికి ముందు నుంచే తన అక్క భర్త గొట్టిపాటి వీరయ్య చౌదరితో శ్రీవిద్యకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్తకు తెలిసింది. భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నరసరావుపేట పెద్దచెరువులో నివసించే అక్క ఇంటి నుంచే కుట్రకు తెరలేపింది. 2017 డిసెంబరు 19న భర్తకు బావతో ఫోన్ చేయించి, నరసరావుపేటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కి రప్పించింది. గతంలో పరిచయం ఉన్న మిత్రులు, బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్లకు చెందిన గుంజి బాలరాజు, ఈపూరు మండలం ముప్పాళ్లకి చెందిన పూజల చౌడయ్యతో కలసి ఆ రోజు రాత్రి అంతా రెస్టారెంట్‌లో గడిపారు. బాకీ వసూలుకు తాము మార్కాపురం వెళుతున్నట్లు చెప్పి తోడుగా నరేంద్ర సాయం కోరారు. అతన్ని కారులో ఎక్కించుకుని వినుకొండ వైపు బయలుదేరారు. మధ్యలో మద్యంలో సైనెడ్ కలిపి, నరేంద్రతో తాగించగా.. కారులోనే చనిపోయాడు. తిరిగి మృతదేహాన్ని తీసుకొచ్చి సాతులూరు వద్ద పెద్దనందిపాడు బ్రాంచి కాలువ కట్టపై పడేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహం పక్కన పురుగు మందు డబ్బా పెట్టి వెళ్లిపోయారు" అని పోలీసులు వెల్లడించారు.
హతుని తండ్రి ఫిర్యాదుతో బట్టబయలు: నరేంద్ర మృతి అనుమానాస్పదంగా ఉండటంతో అతని తండ్రి వీరయ్య నాదెండ్ల పోలీసులకు 2017 డిసెంబరు 20న ఫిర్యాదు చేశారు. అప్పటి చిలకలూరిపేట గ్రామీణ సీఐ శోభనబాబు కేసు దర్యాప్తు చేశారు. మృతుని కాలికున్న ఒక చెప్పుపై అనుమానం తలెత్తింది. దీంతో పాటు చరవాణి కాల్ జాబితాను విచారించారు. రెండో చెప్పు హత్యకు వినియోగించిన కారులో లభించడంతో సాక్ష్యాధారాలతో సహా నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. నరసరావుపేట 13వ జిల్లా అదనపు న్యాయస్థానంలో విచారణ సాగింది. ఫిర్యాది తరఫున పీపీ బాలహనుమంతరెడ్డి వాదనలు వినిపించారు. అభియోగాలు రుజువు కావడంతో ముద్దాయిలు నలుగురికి జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
ఇదీ చదవండి: ఆ అధికారిణిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి: హైకోర్టు