సెలవుపై స్వగ్రామం వస్తున్న ఓ జవాను ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఈ విషయం తెలిసి నిండు గర్భిణి అయిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నందవరం మండలం కనకవీడుపేటకు చెందిన కురువ నాగప్ప, భీమక్క దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మనోహర్ (29) పదేళ్ల కిందట సైన్యంలో చేరారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం జవానుగా పనిచేస్తున్నారు. సెలవుపై శుక్రవారం స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి మధ్యప్రదేశ్‌లోని ఓ స్టేషన్‌లో రైలు దిగి తిరిగి ఎక్కే క్రమంలో కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు.
కాగా.. నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన రమాదేవితో మూడేళ్ల కిందట మనోహర్ కు వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. పుట్టింట్లో ఉంటూ భర్త రాకకోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆమె.. ఈ విషాద వార్తను జీర్ణించుకోలేకపోయింది. భర్తలేని జీవితాన్ని ఊహించుకోలేక.. పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చికిత్స అందించిన వైద్యులు.. ప్రమాదమేమీ లేదని తెలిపారు.
ఇదీ చూడండి: MAA elections 2021: 'మా' కొత్త అధ్యక్షుడు ఎవరు?