Father Pushed Two Childrens Into Canal : Crime News: భార్యపై కోపంతో పిల్లల ఉసురు తీశాడో తండ్రి... ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో చోటుచేసుకుంది. మచిలీపట్నం సమీపంలోని సీతారామాపురానికి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు భవన నిర్మాణ కార్మికుడు. ఏడేళ్ల క్రితం పెదకాకానికి చెందిన జ్యోతితో అతనికి వివాహమైంది. వీరికి కుమార్తె జ్యోత్స్న(6), కుమారుడు షణ్ముఖ వర్మ(4) ఉన్నారు.
బతుకుదెరువు కోసం రెండేళ్ల కిందట దంపతులు పెదకాకాని వచ్చారు. ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ భవన నిర్మాణ పనికి వెళుతున్నారు. పిల్లలు ఎక్కువగా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండేవారు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భర్త వేధిస్తున్నాడంటూ పది రోజుల కిందట పోలీసులకు జ్యోతి ఫిర్యాదు చేశారు. వారు కౌన్సెలింగ్ ఇవ్వడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటూ పనులకు వెళ్తున్నారు.
జ్యోతి తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపాన్ని వెంకటేశ్వరరావు మనసులో పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం అమ్మమ్మ ఇంటి దగ్గరున్న పిల్లలను స్కూటీపై ఎక్కించుకొని తాడేపల్లి శివారులోని మద్రాసు కాలువ దగ్గరికి తీసుకెళ్లాడు. తర్వాత ఒక్కడే ఇంటికి వచ్చాడు. మరోపక్క జ్యోతి పిల్లల కోసం పుట్టింటికి వెళ్లారు. వారు కనిపించక పోయేసరికి కంగారుతో కుటుంబసభ్యులతో కలిసి వెతికారు. ఇంతలో వెంకటేశ్వరరావు అక్కడికి వచ్చి ఏమీ ఎరగనట్లు పిల్లలు ఎక్కడని భార్యను అడిగాడు.
తన బిడ్డలు ఎవరికైనా కనిపిస్తే తన ఇంటికి చేర్చాలని వేడుకుంటూ జ్యోతి ఓ వీడియోలో మాట్లాడి దాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో జ్యోతి, ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు వెంకటేశ్వరరావును స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. తానే పిల్లలను తాడేపల్లి శివారులోని మద్రాసు కాలువలో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాలను బయటకు తీయించారు.
ఇవీ చదవండి: