MULTI LEVEL MARKETING CHEATINGS : గత నెలలో విజయవాడలో సంకల్ప్ సిద్ధి మార్ట్ గొలుసుకట్టు మోసం బయటకు వచ్చింది. సంకల్ప్‌సిద్ధి మార్ట్‌లో వస్తువులు కొనుగోలు చేస్తే పలు ఆకర్షణీయమైన పథకాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం చేశారు. చాలా మందిని చేర్పించారు. వీటిని నమ్మి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చాలా మంది డబ్బు పెట్టి మోసపోయారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో పలువురిని సభ్యులుగా చేర్పించి వారి నుంచి భారీగా వసూలు చేసి, తర్వాత డబ్బులు చెల్లించకుండా కోట్ల రూపాయల మోసం చేసిన ఘటన ఇటీవల అవనిగడ్డ ప్రాంతంలోనూ జరిగింది. ఆ డబ్బును క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి లాభాలను అందరికీ పంచుతామని ఆశ చూపించి చాలా మందిని మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి 3లక్షల 75 వేల రూపాయల వరకు లాగేశారు.
లవ్ లైఫ్ అండ్ నేచురల్ హెల్త్ కేర్ పేరుతో వైద్య పరికరాలను ఆసుపత్రులకు అద్దెకు ఇస్తామని.. వాటి ద్వారా ఆదాయాన్ని మీ వాలెట్లో జమ చేస్తామంటూ చాలా మందిని చేర్పించారు. 20 రోజుల్లో పెట్టిన పెట్టుబడి మొత్తం అద్దె రూపంలో వచ్చేయటంతో పలువురు ఆశ పడ్డారు. అప్పులు చేసి కట్టటమే కాదు బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులతో లక్షలు కట్టించారు. రెండు రోజుల తరువాత అద్దెలు చెల్లించటం ఆగిపోయాయి.
యాప్ కూడా పనిచేయకపోవటంతో అంతా లబోదిబోమన్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో డబ్బు వసూలు చేసే కంపెనీల్లో ఆరా తీయకుండానే ప్రజలు డిపాజిట్ చేస్తున్నారు. వారు బోర్డు తిప్పే వరకు సమాచారం బయటకు పొక్కడం లేదు. ఆకర్షణీయమైన వడ్డీ పేరుతో వల వేస్తున్నారు. దీనికి అదనంగా కొత్తగా సభ్యులను పరిచయం చేస్తే బోనస్ ఇస్తామని ఎర వేస్తున్నారు. విజయవాడలో ఇటీవల వెలుగుచూసిన మోసాలు ఎక్కువగా ఇలాగే బురిడీ కొట్టించారు.
పెట్టుబడులను షేర్ మార్కెట్లు, ఫారెక్స్ ట్రేడింగ్, తదితర మార్గాల్లో పెట్టనున్నట్లు నమ్మిస్తున్నారు. వచ్చిన లాభాలు అందరికీ పంచుతామంటున్నారు. కొందరు అప్పు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టారు. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలే ఇలాంటి మోసగాళ్ల ఉచ్చులో పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
మల్టీ లెవల్ మార్కెటింగ్, ట్రేడింగ్ పేరుతో అనేక సైట్లు, అప్లికేషన్లు ఇటీవల కాలంలో చాలా వచ్చాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీ డబ్బును రెట్టింపు చేస్తామని, పలువురిని చేర్పిస్తే అదనంగా బోనస్ ఇస్తామని చెప్పే సంస్థల గురించి అన్ని రకాలుగా ఆరా తీసిన తర్వాతే ముందడుగు వేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: