తెలంగాణలో నాసిరకం విత్తనాల విక్రయం, అక్రమ నిల్వలు, లైసెన్సు లేకుండానే వ్యాపారాలు, నిషేధించిన విత్తనాల చలామణీ.. ఇవీ కొన్ని జిల్లాల్లో వెలుగు చూసిన అక్రమాలు. విజిలెన్స్ శాఖ తనిఖీల్లో వీటిని గుర్తించి 22 మంది వ్యవసాయాధికారు(ఏవో)లను బాధ్యులుగా తేల్చింది. వారిపై చర్యలకు సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయినా ఏ ఒక్కరిపైనా చర్యలు లేవు. వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలోని కొందరు ఉన్నతోద్యోగుల లాబీయింగే దీనికి కారణమని తెలుస్తోంది.
సోదాలు...
తెలంగాణ వ్యాప్తంగా 162 ప్రాంతాల్లో విత్తన శుద్ధి ప్లాంట్లు, నిల్వ గోదాములు, విత్తన, ఎరువుల దుకాణాలపై రాష్ట్ర విజిలెన్స్ శాఖ బృందాలు గత వానాకాలంలో సోదాలు చేశాయి. గడువుమీరిన నాసిరకం విత్తనాలను అమ్ముతున్నట్లు కనుగొన్నారు. కలుపు మొక్కలను చంపే అత్యంత విషపూరిత రసాయనం గ్లైఫోసెట్‌ను తట్టుకుని బతికే (హెర్బిసైడ్ టాలరెంట్-హెచ్‌టీ) పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వీటిపై కేంద్రం నిషేధం విధించినా చలామణిలో ఉండడం గమనార్హం.
అధికారులపై కఠిన చర్యలు..
వ్యాపారులకు సహకరిస్తున్న 22 మండలాల వ్యవసాయాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ దిశగా ప్రభుత్వం వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఆ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు విజిలెన్స్ నివేదికను, ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టేశారు. చర్యలు లేకుండా అక్రమార్కులకు అండగా నిలిచారు.
అక్రమాలు ఎలా జరిగాయంటే...
వ్యాపారులు విక్రయించే విత్తనాలు, ఎరువుల నాణ్యతను ఎప్పటికప్పుడు ఏవోలు తనిఖీ చేయాలి. గడువు తీరిపోయినవి ఉంటే సీజ్ చేసి కేసులు పెట్టాలి. చాలా మంది ఏవోలు తనిఖీలే చేయడం లేదని విజిలెన్స్ గుర్తించింది. వ్యాపారులు దుకాణాల్లోనే కాకుండా, కొందరి ఇళ్లలో అక్రమ నిల్వలు పెట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎదుల్లపల్లి గ్రామంలో జి.కొమురెల్లి అనే వ్యక్తి అక్రమంగా విత్తనాలు నిల్వ చేసి అమ్ముతున్నట్లు తనిఖీల్లో తేలింది. ఈ విషయం తనకు తెలియదని అక్కడి ఏవో ఉదయ్ అంగీకరించినట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లిలో లక్ష్మీ సీడ్స్ అనే కంపెనీ పేరుతో విత్తనాలను శుద్ధి చేసి నిల్వలు పెట్టారు. ఈ కంపెనీ పేరుతో లైసెన్సే లేదన్న విషయం తనకు తెలియదని అక్కడి ఏవో దేవిక చెప్పినట్లు విజిలెన్స్ నివేదిక వెల్లడిస్తోంది.
విజిలెన్స్ బాధ్యులుగా పేర్కొన్న ఏవోలు వీరే...
ఎస్.నాగరాజు, నారాయణపేట మండలం, జి.ప్రగతి (ములుగు), పి.రాజేశ్ (కౌటాల), గంగాధర్ (దౌల్తాబాద్), ఎ.అర్చన (మేడ్చల్), బి.అంజనీదేవి (వలిగొండ), జి.ప్రసన్నలక్ష్మీ (వికారాబాద్), ఎన్.శామ్యూల్‌జాన్ (కోస్గి), ఎన్.శ్రీధర్‌రెడ్డి (కాజీపేట), అనిత (సదాశివపేట), రాథోడ్ గణేష్ (ఉట్నూరు, ఇంద్రవెల్లి), హరి వెంకట ప్రసాద్ (నాంపల్లి), డి.ప్రియతమ్‌కుమార్ (గరిడేపల్లి), కె.దేవిక (జక్రాన్‌పల్లి), ఆర్.సిద్దిరామేశ్వర్ (ఎడపల్లి), ఎన్.రాంప్రసాద్ (టేక్మాల్), ఎం.గణేశ్‌రెడ్డి, రమేశ్ (శామీర్‌పేట), పి.నర్మద (నాగర్‌కర్నూల్), ఎ.రాజేందర్‌రెడ్డి (మూసాపేట), టి.కృష్ణకుమార్ (నర్సంపేట), జె.ఉదయ్ (కొత్తగూడ).
ఇదీ చూడండి: