తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి చెందిన పొద్దుటూరి మణిదీప్ (24) బీటెక్ పూర్తి చేసి స్థానికంగా ఉద్యోగం చేస్తున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగానికి అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో విద్య ధ్రువీకరణ పత్రాలు తీసుకొని.. ద్విచక్ర వాహనంపై రాజీవ్ రహదారి మీదుగా సొంతూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో శామీర్‌పేట పెద్ద చెరువు వద్దకు రాగానే కాసారం వైపు చూస్తూ వాహనాన్ని నడిపించారు. వాహనం అదుపుతప్పి చెరువు కట్టపై ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తండ్రి నాగరాజు రోధించిన ఘటన పలువురిని కలిచివేసింది. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మరో పాదచారుడికీ తీవ్ర గాయాలయ్యాయి.
శిరస్త్రాణం ఉన్నా.. బెల్టు పెట్టుకోలేదు
మణిదీప్ వాహనం నడిపిస్తున్న క్రమంలో శిరస్త్రాణం ధరించినా.. బెల్టు పెట్టుకోలేదు. ప్రమాద సమయంలో బెల్టు పెట్టుకుంటే బతికేవాడని పలువురు అభిప్రాయపడ్డారు. మణిదీప్ అన్న ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు.
ఇదీ చదవండి: వేర్వేరు ప్రమాదాలు.. ఒక్కరోజే ఐదుగురు మృతి