విశాఖ ఉక్కు పరిశ్రమలో నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ పూర్తిచేస్తామని పార్లమెంట్‌లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు వివిధ సందర్భాలలో కేంద్రం సమాధానం చూస్తే ఈ అంశంలో చర్యలు వేగవంతం తప్పవని స్పష్టమవుతోంది. ఉక్కు పరిశ్రమ కింద 19వేల 500 ఎకరాల భూమి ఉంది. 20 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి అనుగుణంగా ప్లాంట్ ఏర్పాటు కోసం నిర్ణయించినప్పుడే భూమిని సేకరించారు. కాలక్రమంలో గంగవరం పోర్టుకు కొంత భూమిని ఇచ్చారు. దీనికి ప్రత్యామ్నాయంగా రావికమతం మండలంలో కొండవాలు ప్రాంతంలో వేయి ఎకరాలను అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు విశాఖలో ప్లాంట్, టౌన్ షిప్, రిజర్వాయర్ లు కలిసి 19 వేల 500ఎకరాల భూమి మిగిలింది.
ఎవరు కొంటారన్నది ప్రశ్న..
పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ ప్లాంట్ విలువను భూములతో సహా లెక్కిస్తే 2 లక్షల కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా. ఇంత భారీ మొత్తంలోప్లాంట్ ధరను నిర్ణయిస్తే కొనుగోలు చేసేందుకు ముందుకు ఎవరు వస్తారన్నది ప్రశ్న. ఈ విషయంలో రెండు మూడు ప్రతిపాదనలు పెట్టుబడుల ఉపసంహరణకు ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. ప్రస్తుత ప్లాంట్ విలువను 35 వేల కోట్ల రూపాయలుగా స్టీల్ ప్లాంట్ వెబ్ సైట్లో చూపుతున్నారు. 18 వేల కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు జరిపినట్టుగా ప్రకటించారు.
ఈ ఏడాది జులై 30 నాటికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించినట్టు వివరించారు. వీటి ఆధారంగా ప్రధాన ప్లాంట్, టౌన్ షిప్, రిజర్వాయర్లు..ఈ మూడింటికి వేర్వేరుగా విలువను కట్టి పెట్టుబడుల ఉపసంహరణ మొత్తాన్ని నిర్ణయించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈనెలలోనే న్యాయ, సాంకేతిక సలహాదార్ల ఎంపిక పూర్తి చేస్తే..ఒక రోడ్ మ్యాప్ తయారీకి మార్గం సుగమం అవుతుందన్నది మంత్రిత్వ శాఖ యోచన. ఇదే రీతిన వేగంగా చర్యలు తీసుకుంటే ఏడాదిన్నరలోనే అమ్మకం పక్రియ పూర్తవుతుందని నిపుణుల అంచనా.
ఇదీ చదవండి...
SOMU: 'చట్టాలకు విరుద్ధంగా ఏపీ రూ.25 వేల కోట్ల అప్పులు'..కేంద్రానికి సోము వీర్రాజు ఫిర్యాదు