ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకైన విశాఖ ఉక్కు కోసం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాస్త్రాలు సంధించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన..వెంకన్న ఆశీస్సులతోపాటు రాయలసీమ ప్రజల మద్దతు కోసం వచ్చానని తెలిపారు. ఇప్పుడు ఉద్యమించకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాప పడినా ప్రయోజనముండదన్నారు. ఉద్యమవేదికపై కూర్చొని పవన్‌కల్యాణ్ నిరసన తెలపాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటు సంస్థ అయిపోతుందనే వార్త..శరీరంలో ఓ అవయవం పోయేంత బాధను కలిగిస్తోందని గంటా తెలిపారు.
స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా...రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దిల్లీలో ధర్నాకు దిగారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ నేతృత్వంలో ఏపీ భవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రానికి కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని..ప్రత్యేకహోదా, ప్యాకేజీపై ముఖ్యమంత్రి జగన్ మౌనమెందుకు వహిస్తున్నారని శైలజానాథ్ ప్రశ్నించారు.
ఉక్కు ఉద్యమాన్ని, పరిశ్రమ కోసం మహనీయులు చేసిన త్యాగాన్ని కళ్లకు కట్టినట్లుగా 'ఉక్కు సత్యాగ్రహం ' పేరుతో సినిమా చిత్రీకరిస్తున్నట్లు తెలుగుసేన ప్రతినిధి సత్యారెడ్డి తెలిపారు. విశాఖ ప్రైవేటీకరణను తెలుగుసేన తీవ్రంగా ఖండిస్తోందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా... కొన్ని మార్పులు చేసి లాభాల బాటలో నడిపించొచ్చని ఉద్యమకారులు తెలిపారు. ప్రైవేటీకరణతో బడుగు బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతుందని...ఇప్పటికైనా కేంద్రం వెనక్కి తగ్గాలని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు.
ఇదీచదవండి