విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలకు తగిన ప్లాట్ ఫాంలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి రద్దీతో పాటు రంజాన్ పర్వదినం నేపథ్యంలో రైళ్లలో ప్రయాణం చేసే అవకాశం లేనంతగా బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో పలువురు ప్రయాణికులు గంటల తరబడి స్టేషన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
సోమవారం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి బయలుదేరాల్సిన కోర్బా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ ఖాళీ లేకపోవడంతో ఆలస్యంగా వచ్చింది. దీంతో ప్రయాణికులంతా ఒకేసారి రైలు ఎక్కేందుకు యత్నించారు. మరోవైపు రైలు బోగీల తలుపులు తెరవకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అత్యవసర మార్గం ద్వారా లోపలకు వెళ్లేందుకు పోటీ పడ్డారు.
విశాఖలో నిలవాల్సిన పలు రైళ్లు.. ఒకే సమయంలో వరుసగా ఫ్లాట్ ఫాంలను ఆక్రమించి రెండు గంటల పాటు అక్కడే ఉంటున్నాయి. దీంతో విశాఖ స్టేషన్కు వచ్చి వెళ్లాల్సిన పలు రైళ్లు ప్లాట్ఫామ్ పైకి వచ్చేందుకు వీలు లేకుండాపోతుంది. దీంతో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న పలువురు ప్రయాణికులకు తిప్పలు తప్పటం లేదు.
ఇటీవలే కోర్బా రైలు సాధారణ బోగీల్లో కోత విధించడంతో ప్రయాణికులకు సరిపడ సీట్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు రైలు ఎక్కలేక స్టేషన్లో ఉండిపోతున్నారు. నిత్యం ఇదే పరిస్థితి కొనసాగుతున్నా కనీసం పట్టించుకునే నాధుడే లేడని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.