పాలిమర్స్ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెదేపా డిమాండ్ చేసింది. గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను తెదేపా నేతలు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులు పరామర్శించారు. ప్రమాద ఘటనకు సంబంధించి బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ప్రమాద ఘటనకు దారితీసిన కారణాలను, నిజాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పట్ల తమకు, ప్రజలకు నమ్మకం లేదని పేర్కొన్నారు. సీఎం విశాఖ పర్యటనలో బాధిత గ్రామాలకు వెళ్లలేదని విమర్శించారు.ఘటన గురించి పూర్తిగా తెలుసుకోకముందే యాజమాన్యం ప్రతినిధులను ఎయిర్‌పోర్టులో కలవడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఎల్జీ పాలిమర్స్‌లో తయారయ్యే ముడిసరకు ప్రభుత్వానికి చెందిన కొందరు ముఖ్యుల సంస్థలకు వెళ్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమను మూసివేసి అక్కడి నుంచి తరలించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
పరిహారం ఎవరిస్తారు..?
విశాఖ ఘటనలో బాధితులు, మృతుల కుటుంబాలకు ఎక్కువ పరిహారం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే ఆ పరిహారం ప్రభుత్వం ఇస్తుందా.. కంపెనీ ఇస్తుందా.. అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిశ్రమను తెరిపించాలని చూస్తోందని.. ఆయన ఆరోపించారు.
పరిశ్రమ తరలిస్తానని సీఎం స్పష్టంగా చెప్పకపోవడం వల్లే స్థానికుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు కంపెనీపై ఉన్న ప్రేమ బాధితులపై లేదని తెదేపా నేత నిమ్మల రామానాయుడు అన్నారు. పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, తెదేపా నేత చినరాజప్ప డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: