విశాఖ సింహాచలం ఆలయంలో అధికారులు ఎంపీ విజయసాయి రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం, అశోక్ గజపతిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సింహాచలం తొలి పావంచ వద్ద తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాస్, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ విజయసాయి రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అపచారం చేశారని మండిపడ్డారు. దేవస్థానం సంప్రోక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చిన ఈవో సూర్య కళను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఈ చర్యతో హిందువుల మనోభావాలను పూర్తిగా దెబ్బ తీసినట్లేనన్నారు. ఒక ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలకడం ఆలయ సాంప్రదాయానికి పూర్తి విరుద్ధమని.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ఈవోపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విశాఖ భూముల వ్యవహారం విషయంపై నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే.. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుపై అనవరసరంగా విమర్శలు చేస్తున్నారని.. అశోక్ గజపతిరాజు లాంటి మంచి వ్యక్తిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
''భక్తులు ఆరాధిస్తున్న వరాహస్వామి గుడిలో అపచారం చేసినందుకు సంప్రోక్షణ చేయాలి. ప్రభుత్వానికి హిందువులపై, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలపై ప్రేముంటే ఈవో సూర్యకళను సస్పెండ్ చేయాలి. విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలి'' - మాజీ మంత్రి బండారు, తెదేపా నేత
సింహాచలం వ్యవహారంలో ఈవోని తక్షణం సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇకనైనా వైకాపా నాయకులకు మంచి బుద్ధి కలగాలని కోరుకుంటూ స్వామివారికి తొలి పూజలు నిర్వహించారు.
''అర్హతలేని వ్యక్తికి పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలకడం దారణం. ఏళ్లుగా వస్తున్న ఆచారాలను కాలరాయడం దురదృష్టం. వెంటనే ఆలయాన్ని సంప్రోక్షణ జరిపించాలి. ఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలి'' - పల్లా శ్రీనివాసరావు, తెదేపా నేత
అసలేం జరిగిందంటే..
మాన్సాస్ ట్రస్ట్‌లో చాలా అవినీతి జరిగిందని.. దీనిపై తెదేపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుతో చర్చకు సిద్ధమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మాన్సాస్ ట్రస్ట్‌లో జరిగిన అవినీతిని త్వరలోనే బయటపెడతామని చెప్పారు. దర్యాప్తు వేగవంతంగా జరుగుతోందని.. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ ఆక్రమణలు ఎవరు చేశారో విచారణలో బయటపడుతుందన్నారు.
ఇదీ చదవండి:
'రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణానికి అధికంగా కేంద్ర ప్రభుత్వ నిధులు'