22 ఆగస్టు 1922 విశాఖ మన్యంలోని చింతపల్లి పోలీస్‌స్టేషన్‌లో గుండెలదిరే నినాదాలు వినిపించాయి. దాదాపు 300 మంది పోలీస్‌స్టేషన్‌పై మెరుపుదాడి చేశారు. రికార్డులు చించేశారు.!దొరికిన తుపాకులు, మందుగుండు సామగ్రి తీసుకున్నారు! దొంగలా కాదు... దొరలాగే.. ఏమేం తీసుకున్నారో రికార్డు పుస్తకంలో రాసి..ఓ వ్యక్తి సంతకం చేశాడు. అతడే తెల్లదొరలకు కంటి మీద కునుకులేకుండా చేసిన మన్యందొర అల్లూరి సీతారామరాజు.
పోలీసుస్టేషన్లపై దాడులు
బ్రిటీషర్ల పాలనలో పోలీస్టేషన్లంటేనే ఓ అరాచక కేంద్రాలు..! హక్కుల కోసం గొంతెత్తే గళాల్ని అణచివేసే అడ్డాలు.! ఠాణాల్ని దూరం నుంచికన్నెత్తి చూడడమే సాహసం. అలాంటిది ఓ స్టేషన్‌పైనే దాడి చేయడమంటే తెల్లదొరలకు నిద్రలోలేపిమరీ తల తీసేసినట్లు అనిపించింది ! దాన్నుంచి తేరుకోనే లేదు ! బ్రిటీష్ పోలీసులకు షాక్‌మీద షాక్‌లిచ్చింది అల్లూరి సైన్యం.! 1922 ఆగస్టు 23న కృష్ణదేవిపేట, 24న రాజఒమ్మంగి పోలీసుస్టేషన్లపై వరుస దాడులు చేసి దిమ్మ తిరిగే సవాల్ విసిరారు. ఆయుధాలు ఎత్తుకెళ్లారు.
వరుస దాడులు
మూడు వరుస దాడులతో బ్రిటీష్ ప్రభుత్వం బెంబేలెత్తింది.! విప్లవాన్ని మొగ్గలోనే తుంచేయాలనే దుష్టబుద్ధితో కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి పంపింది. 1922 సెప్టెంబర్ 24న సైన్యంతో కలిసి అడవిలోకి వెళ్లారు కబార్డు, హైటర్! ఆ రోజేరామరాజు దళం చేతిలో వారికి నూకలు చెల్లాయి. బ్రిటీషర్లు.... మరింత రగిలారు. అల్లూరిపై పగబట్టారు. మన్యం ముద్దుబిడ్డ మాత్రం అదరలేదు... బెదరలేదు. పోలీస్టేషన్లపై దండయాత్ర కొనసాగించారు. ఈసారి తెల్లదొరల తలదన్నే గెరిల్లా వ్యూహాన్ని రచించారు. అడ్డతీగల పోలీసు స్టేషన్‌పై దాడి చేస్తాం చేతనైతే అడ్డుకోండంటూ సవాల్ చేశారు. ముందే చెప్పినట్లే అక్టోబర్ 15న.. దర్జాగా దాడి చేశారు.! అల్లూరి మొండి ధైర్యానికి బ్రిటీష్ సైన్యం ముందే... చేతులెత్తేసింది. ఆయుధాలు దాచిపెట్టుకోవడం తప్ప అల్లూరి సైన్యాన్ని ప్రతిఘటించలేకపోయింది. అదే తెగువతో అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్‌ను పట్టపగలే ముట్టడించారు రామరాజు. అలా ప్రజల్ని వేధించే పోలీసుల్ని.. కొన్నాళ్లపాటు పోలీస్టేషన్ల వద్దే పడిగాపులు కాయించారు సీతారామరాజు.
రామరాజు... పరశురాముడిగా
నిజానికి మన్యం బిడ్డలకు అల్లూరి...... మొదట యోగిగా పరిచయయ్యారు. పచ్చని అడవుల్లో ప్రశాంతంగా ఉన్న రామరాజు... పరశురాముడిగా మారడానికి చాలా కారణాలున్నాయి. 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో.. జన్మించిన అల్లూరి గోదావరి జిల్లాల్లోని కొవ్వాడ ,నర్సాపురం, రామచంద్రాపురం, తుని ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. నాలుగో ఫారం తప్పినందుకు ఉపాధ్యాయుడు కొట్టారంటూ బడికి బై చెప్పేశారు. గిరిజన స్థితిగతుల్ని ఆకలింపు చేసుకున్నారు. మధ్యలో ఉత్తర భారత యాత్రకు వెళ్లి యోగిగా మారాడు. విశాఖ మన్యానికి మళ్లీ తిరిగొచ్చారు. కృష్ణదేవిపేట సమీపంలో తాండవ నదిలో 'చిక్కలగడ్డ' కలిసేచోట యోగసాధన చేస్తుండేవాడు. అల్లూరి యోగముద్రను బ్రిటీషర్ల అరాచకాలు భగ్నంచేశాయి. పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడం, అటవీ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షలు పెట్టడం,గిరిజనులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇలా మన్యం బిడ్డలపై దాష్టీకాలను తట్టుకోలోకపోయారుఅల్లూరి. 1922 ఆగస్టులో పోరాట పిడికిలి బిగించారు. అడవి బిడ్డల భయాన్ని పోగొట్టి బాణాలు చేతికిచ్చాడు. బ్రిటీషర్ల అరాచకాలపై పోరు పాఠాలు నేర్పాడు. అలా 150మంది సామాన్యుల్ని సుశిక్షితైన విప్లవ వీరుల్లా మార్చారు రామరాజు.
రోజురోజుకూ... తెల్లదొరలకు కొరకరాని కొయ్యలా మారారు అల్లూరి.!
అలాంటి మన్యం బెబ్బులిపై 1922డిసెంబర్ 6న ప్రభుత్వ సేనలు శతఘ్నులు ప్రయోగించగా అనుచరుల్లో నలుగురు అమరులయ్యారు. అదే రాజు దళానికి తగిలిన తొలిదెబ్బ. ఆ అర్థరాత్రి జరిపిన దొంగదాడిలో మరో 8 మంది విప్లవవీరులు నేలకొరిగారు. ఆ సమయంలో బ్రిటీషర్లు రామరాజును, అతని అనుచరుల్ని పట్టిస్తే బహుమతులిస్తామని ప్రకటించారు. 1923 ఏప్రిల్ 17న సీతారామరాజు అనుచరులతో కలిసి అన్నవరంలో ప్రత్యక్షమై బ్రిటీషర్లనినిశ్టేష్టుల్ని చేశారు. సత్యదేవుణ్ని దర్శించుకున్న రామరాజును.. ప్రజలు దేవుడిలా కొలవడం అక్కడి కలెక్టర్‌కు కోపంతెప్పించింది. ప్రజలపై అదనపు పన్నును జరిమానాగా విధించాడు. కలెక్టర్ కథేంటో తేల్చాలని.. నిర్ణయించుకున్న అల్లూరి శంఖవరంలో ఉంటాను కలవాలంటూ కలెక్టరుకు "మిరపకాయ టపా" పంపారు. బాణానికి మిరపకాయలు కట్టి సందేశాన్ని పంపే మిరపకాయ టపాకు...... అల్లూరే ఆద్యుడు .
విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు మన్యాన్ని దిగ్బంధించారు. ప్రజలకు... ఆహారపదార్థాలు అందకుండా చేశారు. చిన్నా,పెద్ద, ముసలీ, ముతకా అనే తేడా లేకుండా చంపారు. 1924 ఏప్రిల్ 17న మన్యానికి స్పెషల్ కమిషనర్‌గా రూథర్ ఫర్డ్ వచ్చారు. వస్తూనే కృష్ణదేవిపేటలో సభ నిర్వహించి... వారం రోజుల్లో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే కాల్చేస్తామంటూ ప్రజల్ని హెచ్చరించాడు. అప్పటికే బ్రిటీషర్ల దమనకాండ ఎక్కువవడంతో రామరాజు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. 1924 మే 7న కొయ్యూరు సమీపంలోని ఒక ఏటి వద్ద కూర్చొని పశువుల కాపరి ద్వారా పోలీసులకు కబురు పంపారు. ఏట్లో స్నానం చేస్తున్న రామరాజును చుట్టుముట్టిన పోలీసులు మేజర్ గుడాల్ వద్ద ఒక చెట్టుకు కట్టేశారు. ఏ విచారణా లేకుండా కాల్చి చంపారు. బ్రిటీషర్ల కళ్లలో కసి కనిపిస్తుందేగానీ అల్లూరివెన్నులో ఎక్కడా వణుకులేదు. తుపాకీ తూటాల తూట్లు పడుతున్నా రామరాజు మాత్రం వందేమాతరం అంటూనే ఆఖరి శ్వాస విడిచారు. మే 8న అల్లూరి దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేశారు. కృష్ణదేవిపేటలో...సమాధి నిర్మించారు.
1922 ఆగస్టు 22న ఆరంభమైన మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జులై మొదటివారంలో ముగిసింది. పాతికేళ్లకే విప్లవోద్యమానికి ఊపిరిలూదిన మన్యం మొనగాడు 27 ఏళ్లకే అమరుడయ్యాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో తెలుగు తెగువ చూపిన అల్లూరిని ఓ శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా జాతీయ పత్రికలు కీర్తించాయి. అహింసాయుత ఉద్యమాన్ని నడిపిన గాంధీజీ కూడా 1926న యంగ్ ఇండియా పత్రికలో.. అల్లూరిని హీరోగా కీర్తించారు. భారతీయలు ఇలాంటి వీరులను మరువలేరంటూ అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్ధాపకుడు సుభాష్ చంద్రబోస్... కూడా ప్రశంసించారు. అల్లూరి వదిలే బాణం, మాట్లాడే మాటా ఒకటే.! చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం.... నాటుకుపోయింది. అదే అతన్ని అడవి బిడ్డల గుండెల్లో ఆరాధ్యుడిగా మార్చింది. తెల్లవారికి సింహస్వప్నంలా మిగిల్చింది. భారత స్వాతంత్ర సమరానికి స్ఫూర్తి కలిగించిన.. మహా ధీరుడు అల్లూరి. యువతలో నరనరానా చైతన్యాన్ని నింపే దీప్తి..! విప్లవజ్యోతి...! ఓ మహోన్నత వ్యక్తి.! మహోజ్వల శక్తి.! తెలుగు ప్రజల తరగని ఆస్తి.
ఇదీ చదవండి