16 Thousand Crore Loan For AP Capital Amaravati Construction : అమరావతి పునర్వైభవం దిశగా మరో అడుగు పడింది. రాజధాని నిర్మాణానికి మరో 16 వేల కోట్ల రుణం అందనుంది. ఈ మేరకు హడ్కో, జర్మనీ బ్యాంక్ కేఎఫ్‌డబ్ల్యూ ముందుకొచ్చాయి. ఇప్పటికే ప్రపంచబ్యాంకు, ఏడీబీ నుంచి 15వేల కోట్ల రుణానికి ఇది అదనం. అలాగే ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్‌గా మళ్లీ నార్మన్ ఫోస్టర్ సంస్థ ఎంపికైంది. రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే పింఛనుకు ఆరంచెల తనిఖీని రద్దు చేసి జగన్ ప్రభుత్వం పింఛను ఎగ్గొట్టిన 4వేల మందికి పునరుద్ధరించారు. ఈ మేరకు సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Loan For AP Capital Amaravati : అమరావతి కొత్త ఊపు వస్తోంది. రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్ల రుణం రాబోతోంది. హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి, ఈ రుణం ఇవ్వనున్నాయి. ఇందులో హడ్కో 11 వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ.5 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వాటితో సంప్రదింపుల ప్రక్రియ మరో 15 నుంచి 20 రోజుల్లోనే కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. రుణం మంజూరుకు సంబంధించిన అంశాలపై హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులతో సంప్రదింపులు జరిపేందుకు సీఆర్‌డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్‌కు ప్రభుత్వం పూర్తి అధికారాలిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ 40వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి అభివృద్ధికి భారీగా బడ్జెట్ - పనులకు త్వరలో టెండర్లు
హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులిచ్చే రుణం రాష్ట్ర రుణ పరిమితి పరిధిలోకి రాదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలసి రాజధానికి 15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు ఇప్పటికే అంతా సిద్ధమైంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, సీఆర్‌డీఏల మధ్య ఇటీవలే దిల్లీలో ఒప్పందం ఖరారైంది. వచ్చే నెల 17 జరిగే ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఒప్పందానికి తుది ఆమోదం లభించనుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణంలో 25 శాతం వచ్చే నెలాఖరులోగా సీఆర్‌డీఏకి అందనున్నాయి. హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకుల నుంచి కూడా నిధులు వస్తే రాజధాని పనులు పరుగులు పెడతాయి.
పనుల్లో నాణ్యత లేకపోతే గుత్తేదారులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి - సీఎం చంద్రబాబు ఆదేశం
రాజధానిలో ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్న హైకోర్టు, శాసనసభతో పాటు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్లకు డిజైన్ల రూపకల్పన బాధ్యతను లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్‌కే తిరిగి అప్పగించేందుకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. 2014-19 మధ్య రాజధానిలో పరిపాలనా నగర ప్రణాళికతో పాటు, హైకోర్టు, శాసనసభ, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయ టవర్ల ఆకృతులను నార్మన్ ఫోస్టర్ సంస్థే రూపొందించింది. తర్వాత జగన్ ప్రభుత్వం రాజధాని పనుల్ని నిలిపివేయడంతో పాటు, నార్మన్ ఫోస్టర్ సంస్థను అర్ధంతరంగా వెళ్లగొట్టింది. ఆ భవనాల ఆకృతులకు సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సిన పని, ఇంటీరియర్ డిజైన్ల రూపకల్పనతోపాటు, మొత్తం భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించేందుకు సీఆర్‌డీఏ ఇటీవల టెండర్లు పిలిచింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ ఎల్1గా నిలిచి, మళ్లీ టెండర్ దక్కించుకుంది.
మహానగరికి మహర్దశ - నవ రాజధానికి రూ.3,445 కోట్లు
హైకోర్టు, శాసనసభ భవనాలకు 138 కోట్లు, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలకు సంబంధించిన ఐదు టవర్లకు కలిపి మరో 138 కోట్లు చెల్లించేలా టెండరు ఖరారు చేయనున్నారు. గతంలో సచివాలయంతో పాటు, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్ని మాత్రమే ఆ ఐదు టవర్లలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర స్థాయి కార్యాలయాల్నీ ఆ ఐదు టవర్లలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొన్ని సంస్థల కార్యాలయాల కోసం గతంలో రాజధానిలో భూములు కేటాయించగా, వాటిని రద్దు చేసి, వాటి కార్యాలయాల్ని కూడా ఐదు టవర్లలోనే ఏర్పాటు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ మేరకు టవర్ల నిర్మిత ప్రాంతం కూడా కొన్ని లక్షల చదరపు అడుగులు పెరుగుతుందని సమాచారం.
గుంటూరు జిల్లా ఉప్పలపాడులో విదేశీ పక్షుల సందడి
హైకోర్టు, శాసనసభ, సచివాలయం భవనాల నిర్మాణానికి రెండు నెలల్లోపే టెండర్లు పిలవనున్నారు. రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ భవనాల డిజైన్ల రూపకల్పనకు సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థకు స్థానిక భాగస్వాములుగా హఫీజ్ కాంట్రాక్టర్, జెనెసిస్ సంస్థలు వ్యవహరించనున్నాయి. జగన్ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నార్మన్ ఫోస్టర్ సంస్థతో కాంట్రాక్ట్‌ను అర్ధంతరంగా రద్దు చేయడంతో, ఆ సంస్థ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిందన్నారు. వారికి 9 కోట్లు పరిహారం చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ
రాజధాని పరిధిలోని గ్రామాల్లో భూమిలేని పేదలకు నెలకు 2,500 చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. దాన్ని ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం అది నెలకు 5 వేలకు చేరింది. 2019 వరకు సుమారు 21 వేల మంది పేదలకు ప్రతి నెలా పింఛను అందేది. జగన్ ప్రభుత్వం ఆరు అంచెల తనిఖీ పేరుతో సుమారు 4 వేల మందికి నిర్దాక్షిణ్యంగా పింఛను రద్దు చేసింది. మిగతావారికి కూడా ఫింఛను చెల్లించేందుకు సకాలంలో నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ప్రతి నెలా సకాలంలో పింఛను చెల్లిస్తోంది. గత ప్రభుత్వం రద్దు చేసినవారికి కూడా పింఛను చెల్లించేలా ఆరంచెల తనిఖీ విధానాన్ని తాజాగా రద్దు చేసింది.
ఒక్కో అడ్డంకీ తొలగించుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం- కోటి ఆశలతో జనం