కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి అపరాధ రుసుం విధించారంటూ విశాఖ నగరానికి చెందిన ఒక ఆసుపత్రి మహిళా ఉద్యోగిని పోలీసులను నడిరోడ్డుపైనే నిలదీశారు. దీనిపై వాగ్వాదం జరిగి, అది తీవ్రమవడంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. ఆమె తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ఈ దృశ్యాలన్నీ శనివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి.
ఇదీ జరిగింది...
విశాఖలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ ఉదయం ఆటోలో ఆసుపత్రికి వెళ్తున్నారు. సాయంత్రం కర్ఫ్యూ కారణంగా వాహనాలు తిరగనందున ఆమె సోదరుడు లేదా స్నేహితుడు వచ్చి ఇంటికి తీసుకెళ్తుంటారు. కర్ఫ్యూ సమయంలో ప్రయాణించడానికి అవసరమైన పత్రాలన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. శనివారం ఆమెను తీసుకెళ్లడానికి స్నేహితుడు వస్తున్న సమయంలో ఆ పత్రాలు లేకపోవడంతో మూడో పట్టణ పోలీసులు ఆమె ద్విచక్రవాహనాన్ని ఫొటో తీశారు.
ఆగ్రహంతో నిలదీత...
వాహనానికి అపరాధరుసుం విధించినట్లు ఆమె సెల్‌ఫోన్‌కు సందేశం రావడంతో.. ఇంటికి వెళ్తున్న అపర్ణ వెనక్కివచ్చి పోలీసులను నిలదీశారు. తనకు అనుమతి ఉన్నప్పుడు తన వాహనంపై ఎలా అపరాధరుసుం విధిస్తారని వాగ్వాదానికి దిగారు. వాదన పెద్దదవడంతో ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. వీలుపడకపోవడంతో అపర్ణ సెల్‌ఫోన్ లాక్కొన్నారు. దీంతో ఆమె తిరగబడటం, మహిళా పోలీసులు నిలువరించడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పోలీసులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించడానికి ప్రయత్నించారు.
యువతి ప్రతిఘటన
తాను తప్పు చేయనప్పుడు ఎందుకు రావాలంటూ ఆమె నేలపై పడుకుని వారిని ప్రతిఘటించారు. ఆమెకు మద్యం పరీక్షలు చేయించాలంటూ సీఐ అప్పారావు పేర్కొనడంతో ‘మీరే మద్యం తాగారేమో! పని లేకుండా రోడ్డుపై తిరిగేవాళ్లను వదిలేసి మమ్మల్ని పట్టుకుంటారేంటి?’ అంటూ అపర్ణ మండిపడ్డారు. అవసరమైతే తాను కూడా మద్యం పరీక్షలు చేయించుకుంటానంటూ సీఐ అప్పారావు పేర్కొన్నారు. ప్రతిరోజూ తన వాహనానికి జరిమానా విధిస్తే జీతమంతా అవి చెల్లించడానికే సరిపోతుందంటూ అపర్ణ కన్నీరుమున్నీరయ్యారు. స్టేషన్‌కు రానని ఆమె తేల్చిచెప్పడంతో చివరకు పోలీసులు వెనుదిరిగారు.
కేసు నమోదు చేశాం
పోలీసు విధులను అడ్డగించినందుకు, మహిళా హోంగార్డును గాయపరచినందుకు లక్ష్మీ అపర్ణ, ఆమె స్నేహితుడు రాజ్‌కుమార్‌లపై సెక్షన్ 352, 353ల కింద కేసు నమోదు చేశామని విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత్ చంద్ర పేర్కొన్నారు. ఆమె వాహనానికి అపరాధరుసుం విధించే సమయంలో రాజ్‌కుమార్ ఎలాంటి పత్రాలను చూపించలేదని, బయట తిరిగేందుకు అతనికి అనుమతీ లేదని స్పష్టం చేశారు. అపర్ణే పోలీసుల దగ్గరకు వచ్చి గొడవపడిందని చెప్పారు.
ఇదీ చదవండి:
Baby murder: చిన్నారి హత్యలో తల్లి పాత్ర లేదు: డీసీపీ ఐశ్వర్య రస్తోగి