Minister Amarnath on 3 capitals: వైకాపా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని, అయినా 90 శాతానికి పైగా పూర్తి చేశామని, ఇంకా సమయం ఉన్నందున మిగిలిన వాటినీ అమలు చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉందన్నారు. ప్రతిష్ఠాత్మకమైన బల్క్‌డ్రగ్స్ పార్క్ రాష్ట్రానికి వస్తుంటే తెదేపా నేత యనమల అది వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఫార్మా రంగానికి రాష్ట్రం హబ్‌గా మారబోతోందని, ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. అమర్‌రాజా సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై పీసీబీ విచారణ జరిపి నిర్ధారిస్తే తెదేపా నేతలు ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు. తెదేపా నేతలు చంద్రబాబు, యనమల రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలన్నారు. విభజన హామీలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ ఆర్‌బీఐకి తెదేపా నేతలు లేఖలు రాశారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడే చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్‌ను జైలుకు పంపాలని పేర్కొన్నారు. వరద ప్రాంతాల పర్యటన సమయంలో సీఎంతో ముచ్చటించిన బాలిక మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. విలీన ప్రాంతాలకు అదనపు వైద్య బృందాలను పంపుతామని మంత్రి చెప్పారు.
ఇవీ చదవండి: