LG Polymers Victims Seminar: విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు రెండేళ్లు పూర్తయినా... ఇంకా ఆ పీడకల స్థానికులను వెంటాడుతూనే ఉంది. బాధితులకు మెరుగైన వైద్యం కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామన్న పాలకుల మాటలు కార్యరూపం దాల్చలేదు. రెండేళ్లయినా ఇంకా తమకు పరిహారం అందలేదని కొందరు మృతుల కుటుంబీకులు వాపోతున్నారు.
విశాఖ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. 2020 మే 7న స్టైరిన్ గ్యాస్ లీకై 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడి ప్రజలను కలచి వేస్తున్నాయి. స్టైరిన్ గ్యాస్ పీల్చిన స్థానికులు ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపడతామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలుగానే మిగిలాయని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రమాదం జరిగి రెండేళ్లయినా మృతుల కుటుంబాల్లో కొందరికి ఇంకా పరిహారం అందలేదని బాధితులు వాపోతున్నారు. వై కనకరాజు, సత్యనారాయణ, వెంకాయమ్మ కుటుంబాలకు ఇంకా పరిహారం ఇవ్వాల్సి ఉందంటున్నారు. వెంకటాపురం గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు... ఆస్పత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ స్ధానంలో కాలుష్యం, ప్రమాదం లేదని మరో పరిశ్రమల పెట్టి స్దానికులకు ఉపాధి కల్పించాలని విన్నవిస్తున్నారు.
స్టైరిన్ గ్యాస్ లక్షణాలు 20సంవత్సరాల వరకు బాధితుల శరీరంలో ఉంటాయని.. మెరుగైన వైద్యం అందిస్తే దుష్పరిణామాలను నివారించొచ్చని ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రఘునాథ రావు అంటున్నారు. బాధిత గ్రామాల కోసం ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. వారికి ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి :