వ్యక్తిగత కారణాలతో జీవీఎసీ కమిషనర్ సృజన సెలవుపై వెళ్తున్నారు. విశాఖ నుంచి బయటికి వెళ్లేందుకు కూడా ఆమెకు అనుమతులిచ్చారు. దీంతో ఆదివారం నుంచి మార్చి 15వ తేదీ వరకూ కమిషనర్ విశాఖలో అందుబాటులో ఉండరు. కుటుంబంతో పాటు చిత్తూరు జిల్లాకు వెళ్లే అవకాశం ఉంది. ఈ అంశం కూడా రాజకీయంగా చర్చనీయాంశమయింది.
విమర్శలకు తావివ్వకూడదనేనా?
2016 నవంబరులో జిల్లాలో సంయుక్త కలెక్టర్‌గా సృజన విధుల్లోకి చేరారు. ఆ తర్వాత 2019 జూన్‌లో జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా, నగరంలో నాలుగేళ్లకు పైగా సేవలందిస్తున్నారు. వరసగా ఇన్నేళ్లు విధుల్లో ఉండటంతో ఎన్నికల్లో విమర్శలకు తావిచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా, రాష్ట్ర అధికారుల్లో చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఈ తరహా విమర్శలకు తావివ్వకూడదనే స్వయంగా కమిషనర్ సృజనే విధులకు దూరంగా ఉండాలని భావించినట్లు తెలుస్తోంది. గతేడాది కొవిడ్ లాక్‌డౌన్‌కు ముందు ఎన్నికల ప్రక్రియ ఆగింది. అప్పుడామె ప్రసూతి సెలవులో ఉన్నారు. ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ కమిషనర్ పి.కోటేశ్వరరావుకు రానున్న నెలరోజులూ జీవీఎంసీ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. లాక్‌డౌన్ ముందుకూడా ఈయనే జీవీఎంసీ ఎన్నికల అధికారిగా కొనసాగారు.
పార్టీల్లో హడావుడి
జీవీఎంసీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తారని చెబుతూ అధికార వైకాపా నేతలు తమ కార్పొరేటర్ అభ్యర్థులతో రెండ్రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. బీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఎన్నికలపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. బీ మరోవైపు ఉక్కు ఉద్యమంపై పూర్తిస్థాయిలో దృష్టిపెడుతూనే నగర ఎన్నికలపై శ్రేణులు ఎలా స్పందించాలనేదానిపైనా తెదేపా నేతలు మథనం చేస్తున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర కీలక నేతలు ఇటీవల నగరానికి వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులపై ఆరా తీసినట్లు తెదేపా వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీ గతేడాది మార్చిలో 15న జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. అప్పట్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ, నామపత్రాల పరిశీలన కూడా అయింది. మార్చి 16న ఉపసంహరణ ప్రక్రియ జరగాల్సి ఉండగా.. అక్కడితే ప్రక్రియ ఆగింది. ఈసారి మళ్లీ ఎక్కడి నుంచి ఆరంభం అవుతుందనే అంశం తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టెంపో వాహనం.. 14 మంది దుర్మరణం