జీవనోపాధి నిమిత్తం ఒడిశా నుంచి విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చిన రాధా రమణ, అతని మిత్రుడు కొండబాబు.. 12 ఏళ్లుగా నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేదల ఆకలి తీరుస్తున్నారు. రాధా రమణ ప్రస్తుతం బ్యాంకు కాలనీలో కేటరింగ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. అందులో వచ్చే ఆదాయంలో కొంత వెచ్చించి అభాగ్యుల కడుపు నింపుతున్నారు. కొండబాబు గొలుగొండ మండలం చిట్టిగుమ్మలో చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
![free food distribution to orphans at narsipatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10123764_397_10123764_1609833581931.png)
అన్నార్తులకు నిత్యం ఆహారం పంపిణీ చేస్తూ నిస్సహాయ స్థితిలో ఉండే వారి కడుపు నింపుతున్నారు వీరిద్దరు. అయితే వీరి సహాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆకలిగా ఉందని చెప్పలేని వారిని.. దయనీయ స్థితిలో రోడ్ల పక్కన, బస్టాండ్లో, పాడుపడిన భవనాల వద్ద ఉండే వారిని... వెతికి మరీ వీరు ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు రాధా రమణ వండి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను కొండబాబు మోటార్ సైకిల్‌పై ఊరంతా తిరిగి పంపిణీ చేస్తూ ఉంటారు. తొలి రోజుల్లో తొమ్మిది మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. ప్రస్తుతం రోజుకి 40 మంది ఆకలి తీర్చే స్థాయికి విస్తరించింది. ఈ సేవల కోసం నెలకు రాధా రమణ సుమారు 40 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.
![free food distribution to orphans at narsipatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10123764_58_10123764_1609832332402.png)
ఆశ్రమం ఏర్పాటే లక్ష్యం..
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని గోపాల బాబా ఆశ్రమంలో నిత్యాన్నదానం చూసి స్ఫూర్తి పొందానని రాధా రమణ పేర్కొన్నారు. ఆశ్రమంలో కలిసిన కొండబాబు సహకారంతో ఇప్పటివరకు అభాగ్యులను ఆదరించి ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సొంత ఖర్చుతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని.. దాతలు సహకారం అందిస్తే నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు రోజూ భోజనాలు సమకూర్చగలమని చెప్పారు వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేయాలన్నది తన జీవిత లక్ష్యమన్నారు.
ఇదీ చదవండి:
వరి కంకులను పేర్చి.. పిచ్చుకల ఆకలి తీర్చే..