రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు ఒక్క మతానికే పరిమితం కాలేదని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా స్పందించిన గజపతిరాజు... రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న వ్యక్తులు, బెయిల్పై విడుదలైన వ్యక్తులను భూములకు ఛైర్మన్లుగా నియమిస్తున్నారని ఆరోపించారు. సింహాచలం భూముల్లో 500 ఎకరాలు తీసుకొని మరోచోట భూములు ఇస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య భూమి ధరల్లో వ్యత్యాసం చెప్పకపోవడం బట్టి ఎంత లూటీ చేస్తున్నారో తెలుస్తోందని దుయ్యబట్టారు. సేవల కింద డబ్బులు తీసుకుంటున్నా వాటికి రక్షణ లేకుండా పోతోందని అన్నారు.
ఏ మతానికి సంబంధించిన భూములు ఆ మతాలవారే చూడాలి కానీ... హిందువుల భూముల పర్యవేక్షణ బాధ్యతను జేసీలకు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కలిసి హిందూ మతాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భావితరాల వారికి హిందూ మతం అందించే విధంగా కృషి చేయాలని అశోక్ విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.