విశాఖపట్నం, మింది ప్రధాన రహదారి, ఏటీఆర్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ఉషా ట్యూబ్స్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ (యూటీపీఎల్) నుంచి లీజుకు తీసుకున్న ఇండస్ట్రీయల్ గోడౌన్‌లో తాము పేపర్ ప్రింటింగ్ యూనిట్‌ను నిర్వహిస్తున్నామని, ముందుస్తుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అధికారులు చేపట్టిన కూల్చివేతల ప్రక్రియను నిలువరించాలని ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ తరఫున ఆంధ్రజ్యోతి విజయవాడ శాఖ మేనేజరు వేమూరి మురళి... హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఇటీవల యథాతథ స్థితి పాటించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయమై శుక్రవారం జరిగిన విచారణలో ఏపీఐఐసీ తరఫు న్యాయవాది ఉగ్రనరసింహ వాదనలు వినిపిస్తూ..''యూటీపీఎల్ యాజమాన్యానికి గతేడాది డిసెంబర్ 15న నోటీసు జారీ చేశాం. అనుమతి ఇచ్చిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం చేశారు. సమీపంలోని పలు షెడ్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వాటిని కూల్చివేసే సమయంలో ఓ షెడ్‌లో మండే స్వభావం ఉన్న రసాయనాలను గుర్తించాం. వివరాలతో మెమో దాఖలు చేశాం'' అని వివరించారు. పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. మెమోతో పాటు దాఖలు చేసిన దస్త్రాలను రికార్డుకు జత చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
ఇదీ చదవండి: