సాగర తీరం విశాఖలో కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కేవలం పది రోజుల్లోనే వంద కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. జిల్లాలో మార్చి 18న తొలి కరోనా కేసు నమోదు కాగా.. ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 212కు చేరింది. తొలి వంద కేసులు నమోదు కావడానికి 72 రోజుల సమయం పట్టినప్పటికీ.. తర్వాత వంద కేసులు నమోదు కావడానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే పట్టింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ తీవ్రత ఉన్న 55 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. దాదాపు 111 మందికి కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
లాక్డౌన్ సడలింపుల వల్లే
ఈనెల ఒకటో తేదీ నుంచి విశాఖలో కొత్త కేసుల రాక విపరీతంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా రోజుకు కనీసం వెయ్యి వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. రోజుకు దాదాపు 15 నుంచి 20 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. లాక్డౌన్ సడలింపుల వల్ల దాదాపుగా చాలా ప్రాంతాల్లో జనం రద్దీ గణనీయంగా పెరగడం.. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకుంటున్నవారి సంఖ్య పెరగడం వల్ల ఇటు క్వారంటైన్ కేంద్రాలు నిండిపోతున్నాయి. ఇక్కడికి వచ్చిన వారికి త్వరితగతిన పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు లేని వారిని హోంక్వారంటైన్కు పంపుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 వేలకుపైగా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి..