విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విశాఖ, కర్నూలు జిల్లాల్లో ఆందోళనకారులు నిరసన చేపట్టారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ప్రజా గాయకుడు దేవిశ్రీ.. విప్లవ గీతం..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. విశాఖలో ప్రజా గాయకుడు దేవిశ్రీ.. విప్లవ గీతాన్ని ఆలపించారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు విశాఖవాసులు చేసిన త్యాగాలు, ప్రైవేటీకరణ వలన ప్రజలకు కలిగే నష్టాలను దేవిశ్రీ తన పాట ద్వారా వినిపించారు. ఎవడురా అమ్మేది... ఎవడురా కొనేది.. అని గానం చేస్తూ.. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి'
ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలచిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని దళిత గిరిజన సంఘం సభ్యులు విశాఖలో ఆందోళన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న విషయాన్ని.. కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని.. దాబా గార్డెన్స్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నినాదాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు ఈ ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు.
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన..
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వమే గనులను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
విశాఖ, ఏఎంఆర్డీయే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు