తెలుగుదేశం, వైకాపా వర్గీయుల పోటాపోటీ మోహరింపుతో విశాఖ విమానాశ్రయం అట్టుడికింది. తెదేపా అధినేత చంద్రబాబు విమానాశ్రయానికి చేరుకునే సమయానికి ఇరు పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలోనే విమానాశ్రయం నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న వైకాపా శ్రేణులు.... ఆయన వాహనశ్రేణిని చుట్టుముట్టారు.
వాహనాలను ముందుకు కదలనీయకుండా అడ్డంగా పడుకున్నారు. ఈ పరిస్థితిపై ఆందోళన చెందిన ఆయన భద్రతా సిబ్బంది.... చంద్రబాబు వాహనం చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. ఎవరూ వాహనం వైపు రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. అదే సమయంలో పోలీసు బలగాలు తీవ్రస్థాయిలో శ్రమించి... వైకాపా కార్యకర్తలను పక్కకు తీసుకువెళ్లారు. ఆ ఉద్రిక్తతల మధ్యే కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు వాహనశ్రేణి ముందుకు కదిలింది. మరోవైపు.. చంద్రబాబు కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పులు విసిరారు. ఆ చెప్పు భద్రతా సిబ్బందికి తగిలింది. ఇది వైకాపా నేతల పనే అని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక.. జాతీయ రహదారిపై బైఠాయించి వైకాపా కార్యకర్తల నినాదాలు చేశారు. వైకాపా కార్యకర్తల బైఠాయింపుతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప పలువురు మాజీ ఎమ్మెల్యేల ముందుకొచ్చిన వైకాపా నాయకులు ‘గో బ్యాక్’ అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. విశాఖ విమానాశ్రయం వద్ద తెదేపా ఎమ్మెల్యే రామకృష్ణబాబు కారును అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.