constructions in Rushikonda: విశాఖలోని రుషికొండను తొలిచి చేపట్టిన నిర్మాణాల ‘ప్లాన్’కు మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనుమతి ఇచ్చింది. అయితే ఈ ప్లాన్‌లో ‘పరిపాలన భవనాలు’ (అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్) అని కూడా ఉండటం గమనార్హం. రుషికొండ వద్ద ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసమే ఈ భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆది నుంచీ ఊహాగానాలు వినిపిస్తుండగా.. పర్యాటక శాఖ దాన్ని తోసిపుచ్చుతూ వస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉల్లాస కేంద్రాలు కలిగిన అత్యాధునిక పర్యాటక ప్రాజెక్టునే నిర్మిస్తామని చెబుతోంది. కానీ ఈ నెల 9న జీవీఎంసీ అనుమతించిన ప్లాన్‌లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పంపిన ఆకృతులన్నీ పరిపాలనా భవనాలను పోలి ఉండడం.. ‘ఎడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్’ అని పేర్కొనడం గమనార్హం. ‘వేంగి, గజపతి, కళింగ, విజయనగరం బ్లాక్స్‌ను గ్రౌండ్, మొదటి అంతస్తుతో నిర్మించేందుకు అనుమతించినట్లు ప్లాన్‌లో పేర్కొన్నారు. 1,713.22 చ.మీ. కలిగిన వేంగి బ్లాకులో పరిపాలన భవనం, వంటశాల, డార్మిటరీ భవనాలు, 903.34 చ.మీ. విస్తీర్ణం కలిగిన గజపతి బ్లాక్‌లో హౌస్ కీపింగ్ నిర్మాణాలు, 6,581.49 చ.మీ. కళింగ, 3,193.56 చ.మీ. విజయనగరం బ్లాక్‌లో సూట్ రూమ్స్ నిర్మించనున్నట్లు ప్లాన్‌లో పేర్కొన్నారు. మరి వీటిని పర్యాటకశాఖకు చెందిన పరిపాలనా భవనాలుగా వినియోగిస్తారా? లేక ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనకా అనేది తేలాల్సి ఉంది.
అసలు పరిశీలించారా?
కొండను పిండి చేస్తూ ఇక్కడ చేపట్టిన నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయనే అంశంపై ఇటు హైకోర్టు, అటు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)లలోనూ కేసులు నడుస్తున్నాయి.
అనుమతి వచ్చేలోపే చాలావరకు పనులు చేపట్టడం తెలిసిందే. అసలు వాటిని సక్రమంగా పర్యవేక్షించకుండానే జీవీఎంసీ అధికారులు అనుమతుల మంజూరు చేశారని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టును పరిశీలించి సీఆర్‌జెడ్, సుప్రీం కోర్టు ఆదేశాల వంటి వాటిని ఎంతవరకు పాటించారో చూడాల్సినప్పటికీ.. అవేమీ పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో అవసరమైన పత్రాలు సమర్పించకపోయినా అనుమతులు ఇచ్చేశారని, అదే సామాన్య ప్రజలకైతే అలా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
మిగిలింది భవిష్యత్తు అవసరాలకట
రుషికొండ మొత్తం విస్తీర్ణం 69.65 ఎకరాలు. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టుకు 9.88 ఎకరాలకు తీర ప్రాంత క్రమబద్ధీకరణ జోన్ (సీఆర్‌జడ్) అనుమతి తీసుకుంది. జీవీఎంసీ నుంచి మాత్రం మొత్తం 69.65 ఎకరాలకు అనుమతి తీసుకుంది. మిగిలిన భూమి భవిష్యత్తు అవసరాలకు వినియోగిస్తామని అందులో పేర్కొనడం గమనార్హం.
అనుమతుల రుసుంకు అయిదేళ్ల వ్యవధి
ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రం సమర్పించేలోగా పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల పత్రాలు సమర్పించాలని జీవీఎంసీ సూచించింది. అనుమతుల కోసం చెల్లించాల్సిన రూ. 19 కోట్ల సొమ్మును అయిదేళ్లలోగా ఏపీటీడీసీ చెల్లించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించగా.. మిగతా రుసుముల కింద రూ. 83,805తో పాటు నిరభ్యంతర పత్రం రుసుం రూ. 1.53 లక్షలు, భవన నిర్మాణ వ్యర్థాల రుసుం రూ. 80.57 లక్షలు కట్టాలని జీవీఎంసీ పేర్కొంది.
ఇవీ చదవండి: