విశాఖలో.. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేడెట్ డేటా సెంటర్ పార్కుకు ఎకరా కోటి రూపాయల చొప్పున 130 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్లౌడ్ డేటా సెంటర్‌తో పాటు ఐటీ బిజినెస్ పార్కు ఏర్పాటు కోసం ప్రోత్సహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సుల మేరకు ప్రోత్సాహకాల ప్యాకేజీకి అనుమతి ఇస్తూ పరిశ్రమలశాఖ ఆదేశాలు జారీ చేసింది. డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం నిర్మాణాలకు విశాఖలోని మధురవాడలో 130 ఎకరాలు కేటాయించింది. భూమి అప్పగించిన మూడేళ్లలోపు కార్యకలాపాలు ప్రారంభిచాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏడేళ్లలోపు నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కుకు 20 ఏళ్లపాటు విద్యుత్ ప్రోత్సహాకాలు అందుతాయని స్పష్టం చేసింది. డేటా సెంటర్లోని విద్యుత్, సమాచార, ఐటీ పరికరాల కోసం 100 శాతం ఎస్జీఎస్టీని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌కు అనుమతి
ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కును కీలకమైన ప్రాజెక్టుగా గుర్తించి 24 గంటల పాటు నీటి సరఫరాకు అంగీకారం తెలియచేసింది ప్రభుత్వం. జాతీయ రహదారి 16కు అనుసంధానం కల్పించేలా ఇతర మౌలిక సదుపాయాలను అదానీ ఎంటర్ ప్రైజెస్ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని సూచనలు ఇచ్చింది. ప్రాజెక్టు కోసం అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ఏపీలోనే 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ ఎంటర్ ప్రైజెస్‌కు అనుమతి ఇచ్చారు. అయితే ఏపీలోనే ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సెంట్రల్ ట్రాన్స్మిషన్కు అనుసంధానిస్తామని పేర్కొంది.
అదానీ ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటు చేయనున్న ఐటీ బిజినెస్ పార్కులో కేవలం ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ కోసం ఇచ్చిన భూమిలో ఎలాంటి నివాసాలు ఉండేందుకు వీల్లేదని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి :
చంద్రబాబు కష్టాన్ని కొట్టేసేందుకు విశ్వప్రయత్నాలు: నారా లోకేశ్