ఇప్పటి వరకు రెవెన్యూ, రవాణా శాఖలాంటి వాటిల్లోనే ఏజెంట్ వ్యవస్థ చూసి ఉంటాం. కానీ విశాఖ సృష్టి ఆసుపత్రి బాగోతంతో వైద్య వ్యవస్థలోనూ... ఏజెంట్లు ఉంటారని బయటపడింది. విశాఖ పోలీసులు దర్యాప్తు చేసే కొద్ది అనేక విషయాలు తెలుస్తున్నాయి. యూనివర్సల్ సృష్టి ఆసుపత్రికి పనిచేసే ఏజెంట్లు.. శిశువులను మార్పు చేయడం, సరోగసితో సంతానం కోసం ఆరాట పడే దంపతులే లక్ష్యంగా చేసుకుంటారని తెలిసింది. పిల్లలు కోసం సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులను మంచి చేసుకుని సరోగసి విధానం ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని.. చెప్పి.. ఆర్థిక అవసరాలున్న మహిళలను మభ్యపెడతారు ఏజెంట్లు. అలా చేసే వారిలో నలుగురిని పోలీసులు గుర్తించారు.
ఈ ఏజెంట్లు గ్రామీణ ప్రాంతంలో ఆశా సిబ్బందితో మాట్లాడతారు. బాలింతల దగ్గరకు వెళ్లి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, ఆ బిడ్డలను ఆస్పత్రికి ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో సృష్టి ఆసుపత్రి తమ సామ్రాజ్యాన్ని విస్తరించింది. వచ్చిన బాలింతలకు డెలివరీ చేసి ఆ పసికందులను డబ్బున్న వారికి విక్రయించడాన్ని వ్యాపారంగా జరిపారు. ఒక్క సృష్టి ఆసుపత్రి నుంచే 56 మంది పసికందుల అమ్మకాలు జరిపారు ఈ ఏజెంట్లు. వైద్యులకు లక్షల్లో, పేద మహిళలకు కొంత సొమ్ము అప్పజెప్పి.. కావల్సినంత జేబులో వేసుకుంటున్నారు. కేవలం విశాఖలో రెండు ఆసుపత్రులను పరిశీలిస్తే నలుగురు ఏజెంట్లు బయటపడ్డారు.. అంటే ఈ తరహా ఏజెంట్లు ఎందరు ఉన్నారో అనేదానిపై పోలీస్ శాఖ దృష్టి పెట్టింది.
ఇప్పటికే సృష్టి ఆసుపత్రి కేసులో 14 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వారిలో ముగ్గురు వైద్యులు, నలుగురు ఏజెంట్లు. మిగిలిన వారు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు.
ఇదీ చదవండి: దారుణం: కారులో ముగ్గురు ఉండగానే నిప్పంటించిన వ్యక్తి