రాజధాని వికేంద్రీకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవడానికి.. సంవత్సర కాలంగా రాజధాని గ్రామాల రైతులు చేసిన పోరాటమే కారణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు(YSRCP MP RAGHURAMA ON CAPITAL AMARAVATI) అన్నారు. ఇకపై అమరావతే రాజధానిగా ఉంటుందని.. విశాఖకు వెళ్లబోదని అన్నారు. రైతుల పాదయాత్ర తిరుమలకు చేరుకునే లోపే.. అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని ముందు నుంచీ తాను చెపుతున్న విధంగానే జరిగిందని రఘురామ అన్నారు.
రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా.. ఒక కులం పేరు చెప్పి తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రైతుల పాదయాత్రపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెయిడ్ ఆర్టిస్టులే పాదయాత్ర(AMARAVATI FARMERS MAHA PADAYATRA) చేస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారని.. యాత్రలో పాల్గొన్న భాజపా నేతలు సుజనాచౌదరి, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? అని ప్రశ్నించారు. రైతుల ఆందోళన చూసి కాకపోతే.. భాజపాకు భయపడి మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
రెండున్నరేళ్ల కాలంలో.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క మంచి నిర్ణయం ఇదేనని ఎంపీ రఘురామ అన్నారు. రాయలసీమ ప్రాంతంలో వరదలు, ముంపు ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేసి చేతులు దులుపుకున్నారన్న ఎంపీ.. ప్రతిపక్ష నేతగా చేసిన ఆరోపణలు ఇప్పుడు సీఎంకు పక్కాగా వర్తిస్తాయని ఎద్దేవా చేశారు. అమరావతి విషయంలో తాను ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టాను తప్ప.. పార్టీతో ఎప్పుడూ విభేదించలేదని స్పష్టం చేశారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన రఘురామకృష్ణరాజు(AMARAVATI REMAINS AS CAPITAL).. తన పార్లమెంటు సభ్యత్వానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు.
ఇదీ చదవండి:
TDP On Three Capitals Repeal Bill: మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ వెనుక రాజకీయ కుట్ర: తెదేపా