'అమెరికా రాజ్యాంగానికి విరుద్ధంగా ట్రంప్ వ్యవహరిస్తుంటే, జగన్ భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని ప్రపంచమంతా ఆమోదిస్తే ట్రంప్ మాత్రం కుర్చీ దిగనన్నట్లే.. జగన్ శైలీ ఉంది. ఎన్నికలు నిర్వహించవద్దనే అధికారం సీఎస్ కు లేదు. ఏ అధికారంతో ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తున్నారు. ఎస్ఈసీకి సహాయ నిరాకరణ రాజ్యాంగ వ్యతిరేకం. సీఎం తరహాలోనే సీఎస్ వ్యవహారశైలి కూడా ఉంది. లేని అధికారాన్ని చలాయించాలని చూడటం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే.' అని యనమల రామకృష్ణుడు విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్ కు సమాచారం ఇచ్చి ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించే సర్వాధికారాలు ఈసీకి ఉన్నాయని యనమల స్పష్టం చేశారు. న్యాయస్థానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పటం ప్రభుత్వం చెప్పిందిల్లా చేయమని కాదన్నారు. తమ అంగీకారం తీసుకునే ఎన్నికలు నిర్వహించాలనే వితండ వాదన విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ తరహా ముఖ్యమంత్రిని, వింత పార్టీని, వితండ ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు.
ఎన్నికలను వాయిదా, మళ్లీ నిర్వహణకు సంబంధించి అధికారం ఎన్నికల సంఘానిదేనని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. కోర్టు ఆదేశాలను అమలు చేయనివ్వకుండా, స్వయం ప్రతిపత్తితో ఎన్నికల సంఘాన్ని పని చేయనీయకుండా జగన్ వ్యవహరిస్తున్నారు. న్యాయస్థానాలు, రాజ్యాంగ సంస్థలతో ఆటలాడటం జగన్ కు తగదు. జగన్ పాలనలో నెపోటిజం, ఫేవరిటిజం తప్ప మరేం లేదు. ఈ రెండు విధానాలు చట్టవ్యతిరేకమే.
- యనమల రామకృష్ణుడు
ఇదీ చదవండి: జనసిరితో మురవనున్న తుంగభద్రమ్మ