A family living on footpath: పీతల పార్వతి ఫుట్‌పాత్‌పై చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తోంది. పక్కనే ఉన్న ఆ ముగ్గురు.. ఆమె కుమార్తె పిల్లలు. పార్వతి కుమార్తె ఆరేళ్ల క్రితం మూడో బిడ్డ పుట్టాక అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత కొద్ది నెలలకే అల్లుడూ మృతి చెందాడు. అప్పటినుంచి మనవరాళ్ల బాధ్యత ఆమెపై పడింది. కాగితాలు ఏరుకుంటూ, చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న పార్వతి.. 20 ఏళ్లుగా విజయవాడ సత్యనారాయణపురంలోని ఏలూరు కాల్వ వంతెన ఫుట్‌పాత్‌పైనే ఉంటోంది. నగరంలో ఇంటికి అద్దెలు కట్టలేక.. చెట్టు కిందే జీవనం సాగిస్తోంది. ముగ్గురు ఆడ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. దాతలు ఇచ్చిన భోజనం, దుస్తులను పిల్లలకు ఇచ్చి బతుకు బండి లాగిస్తోంది.
"ఎండొచ్చినా వానొచ్చినా ఆడపిల్లలతో రోడ్డు పక్కన పడుకోవాలంటే భయం వేస్తుంది. ఆకతాయిలతో ఇబ్బందిగా ఉంది. ఇల్లు ఉంటే ఆడబిడ్డలకు కొంచెం రక్షణగా ఉంటుందని, సొంత ఇంటి కోసం కార్యాలయాల చుట్టూ తిరిగా. రేషన్ కార్డు లేదని ఇవ్వడం లేదు. ప్రజాసాధికార సర్వేలో వివరాలు నమోదు కాలేదని, ఇంకేవో కారణాలతో రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు లేదని ఇల్లు, పింఛను వంటి లబ్ధి చేకూరడం లేదు. మనవరాళ్లని పాఠశాలలో చేర్పించాలనుకున్నా ఆధార్ కార్డులు లేవని చేర్చుకోవడం లేదు" -పార్వతి