vijayawada streets : నగరాల్లోని వీధులను ప్రజావసరాలకు తగ్గట్టు అందంగా తీర్చిదిద్దడంలో విజయవాడ జాతీయ స్థాయిలో తొలి 11 స్థానాల్లో నిలిచింది. నగరాల్లో వీధులను సురక్షితంగా, ఆరోగ్యకరమైన బహిరంగ ప్రదేశాలుగా తీర్చిదిద్దే అంశాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలించింది. దేశంలోని 100 నగరాల మధ్య నిర్వహించిన ‘స్ట్రీట్స్ 4 పీపుల్ ఛాలెంజ్’లో విజయవాడ తొలి 11 స్థానాల్లో నిలిచింది. వీధులను వాహన కేంద్రాలుగానే కాకుండా ప్రజాకేంద్రాలుగా మార్చాలన్న 2006 నేషనల్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు పాలసీని దృష్టిలో ఉంచుకొని కేంద్రం పోటీలో పాల్గొన్న నగరాల ప్రజలతోపాటు, క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వీధులను నడకకు అనుకూలమైన కేంద్రాలుగా మలిచారు. ఇందులో ఔరంగాబాద్, బెంగళూరు, గుర్‌గ్రాం, కోచి, కోహిమా, నాగ్‌పుర్, పింప్రీ చించిన్‌వాడ్, పుణే, ఉదయ్‌పుర్, ఉజ్జయిన్, విజయవాడలు తొలి 11 స్థానాల్లో నిలవగా.. ఇంఫాల్, కార్నాల్, సిల్వాసా, వడోదరాలు జ్యూరీ స్పెషల్ మెన్షన్ అవార్డుకు ఎంపికయ్యాయి. విజయవాడలో ప్రజానుకూలంగా తీర్చిదిద్దాలనుకున్న వీధులను ఆన్‌లైన్ పోలింగ్ ద్వారా ఎంపిక చేశారని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ పేర్కొంది. పాతకారు టైర్లు, రంగురంగుల పెయింట్లు ఉపయోగించి నగరంలోని 3ప్రాంతాలను అందంగా మలిచినట్లు తెలిపింది. ఈ వీధులను నడక, సైక్లింగ్, ప్రజారవాణాకు అనువుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ఒక్కోదానికి రూ.50 లక్షల నిధి సమకూర్చనుంది. ఇక్కడ పార్కింగ్ పాలసీ, పార్కింగ్ మేనేజ్‌మెంట్ అమలుచేయాల్సి ఉంటుంది.
కాకినాడ, వరంగల్‌కు అవార్డులు
ఇరుగు పొరుగు ప్రాంతాలను చిన్నారులకు అనువుగా తీర్చిదిద్దే పోటీలో కాకినాడ తొలి ఐదు స్థానాల్లో, వరంగల్ తొలి పదో స్థానాల్లో నిలిచాయి. నగరంలోని నిరుపయోగమైన వీధి స్థలాలను సురక్షితమైన కాలిబాటలుగా, చిన్నారులు ఆడుకునే ప్రాంతాలుగా తీర్చిదిద్దినందుకు కాకినాడకు ఈ గుర్తింపు లభించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు ఆడుకునే స్థలాలను మెరుగుపరచడంతోపాటు నగరంలోని వీధులు, కూడళ్ల వెంట కాలినడకన వెళ్లేలా మౌలిక వసతులు కల్పించినందుకు వరంగల్‌కు తొలి పది స్థానాల్లో అవకాశం లభించింది.
ఇదీ చదవండి : కరోనా మృతుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి ప్రభుత్వం అనుమతి