విజయవాడ ధర్నా చౌక్ అంటే నిరసనలకు వేదిక. రైవస్ కాలువ ఒడ్డున, అలంకార్ కూడలి పక్కనే ధర్నా చౌక్ ఉంటుంది. ఇక్కడ నిత్యం ఏదో ఒక అంశంపై చాలా మంది తమ గళం వినిపిస్తుంటారు. తమ సమస్యల సాధనకోసం రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం.. అంతకంతకూ ధర్నాల సంఖ్య పెరుగుతున్నందున అక్కడ నిఘా పెంచాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు సాంబమూర్తి రోడ్డులో అలంకార్ కూడలి నుంచి కూర్మయ్య వంతెన వరకు నిఘా కెమెరాలు బిగిస్తున్నారు. దాదాపు 600 మీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతంలోని రోడ్డుపైనున్న స్తంభాలకు వంద కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాల్లో రికార్డయ్యే దృశ్యాలను ధర్నాచౌక్‌లో ఉన్న సబ్ కంట్రోల్ వద్ద ప్రత్యేక తెరలపై కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దృశ్యాలను ఆధారంగా పోలీసులు ఆందోళనలను పర్యవేక్షిస్తారు.
మధురానగర్ పోలీసు ఔట్‌పోస్టును కమాండ్ కంట్రోల్
ఈ నెల 3న ఉద్యోగులు చేపట్టిన ‘ఛలో విజయవాడ’ పర్యవేక్షణ కోసం బీఆర్టీఎస్ రోడ్డులో హడావుడిగా వంద కెమెరాలు బిగించారు. వీటిని తొలగించి శాశ్వత ప్రాతిపదికన కెమెరాలు బిగించేందుకు ప్రత్యేకంగా స్తంభాలు ఏర్పాటు చేయనున్నారు. అప్పట్లో మధురానగర్ కూడలి వరకే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయగా.. భవిష్యత్తు అవసరాల కోసం పడవల రేవు సెంటర్ వరకు మరో కిలోమీటరు పొడిగించనున్నారు. ఈమేరకు అదనంగా ఇంకో 50 కెమెరాలు తెప్పిస్తున్నారు. ఈ కెమెరాల్లోని దృశ్యాల పరిశీలన కోసం మధురానగర్ పోలీసు ఔట్‌పోస్టును కమాండ్ కంట్రోల్‌గా మార్చనున్నారు. ఇక్కడినుచే బీఆర్టీఎస్ రోడ్డును పోలీసులు పర్యవేక్షిస్తారు. ధర్నాచౌక్‌తోపాటు బీఆర్టీఎస్ రోడ్డులోని కమాండ్ కంట్రోల్ కేంద్రాలు.. సత్యనారాయణపురం పోలీసుల నియంత్రణలో పనిచేస్తాయి.
ఇదీ చదవండి: Asha workers chalo collectorate: రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్ల చలో కలెక్టరేట్ కార్యక్రమం