రౌడీ షీటర్ ముద్దన సాయి కుమార్ అలియాస్ ఇత్తడి సాయికి సీపీ బి.శ్రీనివాసులు నగర బహిష్కరణ విధించారు. నగరంలో శాంతి భద్రతలకు, సామాన్య ప్రజా జీవనానికి విఘాతం కలిగిస్తున్నందున రౌడీ షీటర్ ముద్దన సాయి కుమార్‌ను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లుగా విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు ఉత్తర్వులిచ్చారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో సాయి కుమార్‌పై రౌడీ షీట్ నమోదైంది.
జైలుకెళ్లొచ్చినా మారని తీరు...
సాయి పలు నేరాలకు పాల్పడి గతంలో జైలుకు వెళ్లొచ్చాడు. బయటకు వచ్చిన తరవాత కూడా నేర ప్రవృత్తిని మార్చుకోకపోవడంతో 6 నెలల పాటు నగరబహిష్కరణ విధించారు. నగరంలో ఉన్న రౌడీ షీటర్లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్టు సీపీ పేర్కొన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. నగరంలో నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి.. వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.