కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 320 పైమాటే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సగటున పది కేసులు నమోదవుతుండటం... వాటిలోనూ అధికశాతం విజయవాడ నగరంలోనే ఉంటుండటం అందరినీ ఆందోళనకు గరుచేస్తోంది. లాక్డౌన్ సమయంలో ప్రజలను బయట తిరగనివ్వకుండా నియంత్రిస్తుంటే రోజూ ఇన్నేసి కేసులు ఎలా నమోదవుతున్నాయనే కోణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాహనాల సర్వే చేపట్టారు.
నగరంలోని ఆరు ప్రధాన కూడళ్లైన బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్, చిట్టినగర్, తాడిగడప, కంట్రోల్‌రూం జంక్షన్, డాబా కొట్టుల సెంటర్లలో వేరువేరు సమయాల్లో గంటకు ఎన్ని వాహనాలు చొప్పున తిరుగుతున్నాయనే అంశంపై పోలీసులు సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వెళ్తున్న ప్రతి వాహనాన్ని ఆపి వివరాలు, కారణాలు నమోదు చేశారు. ఈ ఆరు కూడళ్లలోనే గంట వ్యవధిలో సగటున 18 వందలకుపైగా వాహనాలు తిరిగితున్నాయని అధికారులు గుర్తించారు.
కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నా... ప్రజల్లో మాత్రం భయం ఉండట్లేదు. లాక్డౌన్ మినహాయింపు సమయంలో నిత్యావసరాల కోసం యథేచ్ఛగా రహదారులపైకి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. 9గంటల తర్వాత వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సేవల నిమిత్తం కోసం వెళ్లేవారి సంఖ్యా అధికంగానే ఉంటోంది. వీరిలో ఎక్కువ శాతం ప్రభుత్వం కల్పించిన మినహాయింపులను సద్వినియోగం చేసుకునేవారే ఉంటున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే కరోనా వేంగగా వ్యాప్తి చేందే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.