సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలవడం చట్టవిరుద్ధం కాదని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ప్రస్తుతం రమేశ్ కుమార్ రాజ్యాంగ పదవిలో లేరని.. అలాంటప్పుడు ఎంపీని కలవడం నేరమెలా అవుతుందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని నిమ్మగడ్డ సుజనాకు చెప్పి ఉంటారని అభిప్రాయపడ్డారు.
'వారి కలయికలో తప్పేముంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాలను బేఖాతరు చేస్తోందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్యసభ ఎంపీకి చెప్పడం నేరమెలా అవుతుంది. వైకాపా దౌర్జన్య పాలనపై కేంద్రం స్పందించాలని కోరడం తప్పెలా అవుతుంది. అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి దీని మీద ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడంలేదు.'-- వర్ల రామయ్య, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు
వైకాపా దుర్మార్గ పాలనపై కేంద్రం స్పందించాలని కోరడం తప్పేమీ కాదని సమర్థించారు. పార్క్ హయత్ హోటల్ నిషేధిత ప్రాంతం కాదని.. 'దొంగ దొరికాడంటూ' అంబటి రాంబాబు అనడం హాస్యాస్పదమన్నారు. పార్క్ హయత్‌లోని సీసీటీవీ ఫుటేజీని సాక్షికి ఇవ్వడంపై పోలీసు యంత్రాంగం సంజాయిషీ చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...