విశాఖ మన్యంలో వైకాపా ప్రభుత్వం అక్రమ మైనింగ్ ఆపకుంటే ఉత్తరాంధ్ర బచావో నినాదంతో మరో పోరాటం తప్పదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై విచారణ జరపాలని హరిత ట్రిబ్యునల్‌కు లేఖ రాశామని ఆమె తెలిపారు. గిరిజనులు, వారి సంపద జోలికి ఎవరొచ్చినా..తెదేపా చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్...పది కాలాలకు సరిపడా పదింతలు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
అమాయకులైన గిరిజనులపై అధికారం అనే రాక్షస పంజాను విసిరారని అనిత మండిపడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోచేసినట్లుగా కడప సిమెంట్ పరిశ్రమలు మన్యంలోని విలువైన ఖనిజ సంపదను దోచేస్తున్నాయని ఆరోపించారు. విశాఖలో తిరుగుతున్న లారీలన్నీ భారతి సిమెంట్స్ వేనని అనిత ఆరోపించారు. ప్రభుత్వాధికారులు ఎంత సమర్ధించుకున్నా విశాఖ మన్యంలో అక్రమాలు జరిగాయని చూపించేందుకు తాము సిద్ధమని తెలిపారు.
ఇదీ చదవండి:
'తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై పార్లమెంట్లో ప్రస్తావిస్తాం'