UTF leaders house arrest: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు కోసం యూటీఎఫ్ ఆధ్వర్యంలో.. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 25న విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. కాగా.. పలు జిల్లాల్లో యూటీఎఫ్ నేతలను పోలీసులు గృహనిర్భందం చేశారు.
నిరసన కార్యక్రమానికి అనుమతి లేదు.. విజయవాడలో ఈనెల 25న యూటీఎఫ్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు కోరుతూ.. నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. కాగా.. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణా టాటా స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని.. ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలన్నారు.
‘పోరు గర్జన’ పేరుతో ఉద్యోగులు చేపట్టిన బైక్ ర్యాలీని.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి వద్ద పోలీసులు శనివారం అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీతోపాటు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రవికుమార్, పీవీ నరసింహారావులను అదుపులోకి తీసుకున్నారు. పెదవేగిలోని పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్బంధించి, సాయంత్రం విడిచిపెట్టారు.
విజయవాడకు బయలుదేరిన విజయనగరం జిల్లాకు చెందిన యూటీఎఫ్ నేతలను గృహ నిర్బంధం చేశారు. జిల్లా అధ్యక్షుడు రమేష్‌చంద్ర సహా బొబ్బిలిలో విజయగౌరి, గరివిడిలో సత్యశ్రీనివాస్ ను.. విజయవాడకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. విజయవాడలో ఈనెల 25న యూటీఎఫ్ ఆధ్వర్యంలో పొరుగర్జన ర్యాలీ చేపట్టనున్నారు.
- శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమైన పోరుగర్జన యాత్ర తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా పాలకోడేరు మండలం మోగల్లుకు చేరుకునే సమయంలో పోలీసులు అడ్డగించారు. ప్రకాశం జిల్లా దర్శిలో బైక్‌జాతా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఎండవల్లి శ్రీనివాసరెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరారెడ్డి, రవి, పి.బాబుల్‌రెడ్డి తదితరులను బలవంతంగా సీఐ కార్యాలయానికి తరలించారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ర్యాలీలో పాల్గొన్న వారి సామాజికవర్గం వివరాలను కూడా పోలీసులు నమోదు చేసుకోవడంపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు.
25న సీఎం కార్యాలయం ముట్టడిస్తాం.. సీపీఎస్ రద్దు చేయకపోతే ఈనెల 25న సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్ ప్రకటించారు. ‘మ్యానిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని సీఎం జగన్ చెప్పారు. ఈ హామీతో సీఎం జగన్.. 2లక్షల మంది ఉద్యోగుల్లో ఆశలు కల్పించారు.
హామీని నెరవేర్చకపోవడం ఎంతవరకు సమంజసం..? సీపీఎస్ రద్దు కోసం 18న ప్రారంభమైన బైక్ ర్యాలీలు 25న విజయవాడకు చేరుకుంటాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బైక్ ర్యాలీ విజయవాడ చేరేలోపు సీపీఎస్ రద్దు చేయాలి’ అని వారు డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో 200మంది యూటీఎఫ్ నాయకులను గృహనిర్బంధం చేశారు. ఈ నెల 25న సీఎంవో కార్యాలయం ముట్టడికి.. యూటీఎఫ్ పిలుపునివ్వటంతో యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సహా పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. అందరూ పోలీసుస్టేషన్‌కు రావాలని.. పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు వారు తెలిపారు.
ప్రకాశం జిల్లా.. కనిగిరి, పామూరు, చంద్రశేఖరపురం, పెదచెర్లోపల్లి, హనుమంతునిపాడు మండల కేంద్రాల్లోని యూటీఎఫ్ నాయకులకు.. పోలీసులు నోటిసులిచ్చారు. అనంతరం వారిని స్టేషన్ కు పిలిపించి.. రేపు జరగబోయే నిరసనకు వెళ్లొద్దని సంతకాలు తీసుకున్నారు. దీనిపై యూటీఎఫ్ నాయకులు, ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
ముఖాముఖి.. పోలీసులు ఎంత నిర్బంధాలు చేసినా.. సీఎంవోకు బైక్ ర్యాలీ చేసి తీరుతామంటున్న యూటీఎఫ్ నాయకులతో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: