Chandrababu: అరెస్టయిన వారికీ హక్కులుంటాయని.. కస్టడీలోకి తీసుకున్న ఎవరిపైనయినా పోలీసులు దురుసుగా ప్రవర్తించటానికి వీల్లేదని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. ఎవరినైనా అరెస్టు చేస్తున్నప్పుడు పోలీసు అధికారులు వారి పేరు, హోదా స్పష్టంగా కనిపించేలా ఉన్న నేమ్ బ్యాడ్జీ తప్పనిసరిగా ధరించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు.
‘డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. తెదేపా జాతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వాటిని చదివి వినిపించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు సహా సామాన్య ప్రజానీకంపైనా పోలీసులు అక్రమ కేసులు పెడుతూ, అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఈ హక్కుల గురించి విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
ప్రధానాంశాలివీ..
అరెస్టు మెమోలో వివరాలన్నీ సక్రమంగా ఉంటేనే సంతకం
- ఎవరినైనా అరెస్టు చేసేటప్పుడు ఆ తేదీ, సమయం, స్థలం వివరాలతో సంబంధిత పోలీసు అధికారి తప్పనిసరిగా మెమో రూపొందించాలి.
- వారి బంధువులు లేదా స్థానికంగా ఉండే గౌరవప్రదమైన వ్యక్తుల్లో కనీసం ఒకరితోనైనా మెమోపై సాక్షి సంతకం తీసుకోవాలి.
- అవన్నీ సక్రమంగా ఉంటేనే అరెస్టయిన వ్యక్తి దానిపై సంతకం చేయాలి.
గాయాలున్నాయా అనేది రికార్డు చేయాలని అడగొచ్చు
- అరెస్టయిన వ్యక్తి కోరితే తప్పనిసరిగా ఇన్‌స్పెక్షన్ మెమో రూపొందించాలి. శరీరంపై గాయాలేమైనా ఉన్నాయా? అని పరిశీలించి నమోదు చేయాలి.
- అరెస్టయిన వ్యక్తి, చేసిన అధికారీ మెమోపై సంతకం చేయాలి. దాని ప్రతిని సదరు వ్యక్తికి తప్పనిసరిగా ఇవ్వాలి.
సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలి
- అరెస్టు సమాచారాన్ని తన కుటుంబసభ్యులు/బంధువులు లేదా స్నేహితులకు తెలియజేయాలని ఆ వ్యక్తి పోలీసు అధికారిని కోరవచ్చు. ఆ వివరాల్ని సంబంధీకులకు పోలీసు అధికారి తప్పనిసరిగా తెలియజేయాలి.
- వారు ఇతర జిల్లాలు/ నగరాల్లో ఉంటే.. సంబంధిత పోలీసుస్టేషన్‌కు 12 గంటల్లోగా టెలిగ్రామ్ సమాచారమివ్వాలి. అరెస్టయిన వ్యక్తి సంబంధీకులకు విషయం తెలియజేయమని కోరాలి.
- జిల్లా న్యాయ సహాయ కమిటీలకూ ఈ సమాచారాన్ని తప్పనిసరిగా తెలియజేయాలి.
ఎవరి కస్టడీలో ఉన్నారో డైలీ డైరీలో రాయాలి
- అరెస్టు వివరాలు, ఆ సమాచారాన్ని పోలీసులు ఎవరికి తెలియజేశారు? ఆ వ్యక్తి ఎవరి కస్టడీలో ఉన్నారో స్టేషన్‌లోని డైలీ డైరీలో నమోదు చేయాలి.
- 12 గంటల్లోగా పోలీసు కంట్రోల్ రూమ్‌కూ సమాచారం ఇవ్వాలి.
న్యాయవాదితో మాట్లాడే హక్కును నిరాకరించలేరు..
- విచారణ సమయంలో న్యాయవాదిని సంప్రదించే హక్కు అరెస్టయిన వ్యక్తికి ఉంటుంది. పోలీసులు దాన్ని నిరాకరించలేరు.
- పోలీసులు అరెస్టు మెమో, ఇన్‌స్పెక్షన్ మెమో సహా అన్ని రికార్డుల ప్రతుల్ని స్థానిక మెజిస్ట్రేట్‌కు సమర్పించాలి.
48 గంటలకోసారి వైద్యపరీక్షలు కోరవచ్చు
- పోలీసుల నిర్బంధంలో ఉన్నప్పుడు 48 గంటలకోసారి వైద్య పరీక్షలు చేయించాలని కోరే హక్కు సంబంధిత వ్యక్తికి ఉంటుంది.
- వైద్యారోగ్య శాఖ అధికారులు రూపొందించిన ప్యానల్ జాబితాలోని వైద్యులతో పరీక్షలు చేయించాలి.
ఇవీ చూడండి: